ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మరోసారి జైలుపాలు చేసేందుకు ప్రత్యర్థులంతా ప్రయత్నిస్తున్నారా.. ఇందుకోసం ఆయనపై ఉన్న సీబీఐ కేసులను మరోసారి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారా.. ఈ మేరకు తెర వెనుక ప్రయత్నాలన్నీ జోరుగా సాగుతున్నాయా..ఈ ప్రశ్నలకు సమాధానాలు అవుననే వస్తున్నాయి. ఈ విషయాలు చెబుతున్నది ఎవరో అయితే అంతగా పట్టింటుకోవాల్సిన అవసరం లేదు. కానీ వైసీపీలో నెంబర్ టూ గా ఉన్న విజయసాయిరెడ్డే ఈ విషయాన్ని బయటపెడుతూ.. ఏకంగా కేంద్ర హోంమంత్రికే లేఖ రాశారు.

 

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజయసాయిరెడ్డి రాసిన లేఖలో అనేక సంచలన విషయాలు ఉన్నాయి. ఆయన రాసినదాన్ని బట్టి చూస్తే.. జగన్ ను జైళ్లో పెట్టేందుకు భారీ స్కెచ్ రెడీ అవుతున్నట్టు వైసీపీ విశ్వసిస్తోందన్నమాటే. ప్రస్తుతం హైదరాబాద్ సీబీఐ జేడీ కృష్ణ సైతం తెలుగు వ్యక్తి.. రాజకీయాలతో ముడి పడి ఉన్న అధికారి. కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారని విజయసాయి రెడ్డి అంటున్నారు. మరోవైపు లక్ష్మీనారాయణ సన్నిహితులైన హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారట.

 

అంతే కాదు.. ఆయన తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. కానీ ఆయన తల్లిదండ్రులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని విజయసాయి రెడ్డి చెబుతున్నారు. ఆయన మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయట. అంతే కాదు.. లక్ష్మీనారాయణతో సదరు వెంకటేశ్ కు పలు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.

 

లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్న కాలంలో వెంకటేశ్ ఎస్పీగా పని చేశారు. చంద్రబాబు తన మనుషులను సీబీఐలో పెట్టుకుని చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారని విజయసాయిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. తన హయాంలో జరిగిన భారీ అవినీతి నేపథ్యంలో కేసుల నుంచి రక్షణ కోసం తన అధికారులను సీబీఐ హైదరాబాద్‌లో నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నది విజయసాయి ఆరోపణ.

మరింత సమాచారం తెలుసుకోండి: