ప్రముఖ కమెడియన్, ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృథ్వీకి సంబంధించిన బాగోతాలు ఇవే అంటూ ఆయన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పృథ్వీపై వస్తున్న ఆరోపణలు నిజాలో కాదో తెలియాల్సి ఉన్నప్పటికీ భారీ స్థాయిలో పృథ్వీపై ఆరోపణలు వస్తూ ఉండటం గమనార్హం. నిన్న పృథ్వీ ఒక మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన సంభాషణ వైరల్ అయిన విషయం తెలిసిందే. 
 
ఆడియో టేప్ వైరల్ అయిన తరువాత పృథ్వీ పద్మావతి గెస్ట్ హౌస్ లో మద్యం తాగాడని, డబ్బులు తీసుకుని ఉద్యోగులను నియమించాడని, మహిళా ఉద్యోగులకు జీతం పెంచుతానని చెప్పి లోబర్చుకునే ప్రయత్నాలు చేశాడని రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘమే పృథ్వీపై ఇలాంటి ఆరోపణలు చేయడంతో పృథ్వీపై విమర్శలు పెరుగుతున్నాయి. 
 
ఎస్వీబీసీ లో 36 మంది ఉద్యోగులను పృథ్వీ డబ్బులు తీసుకొని అక్రమంగా నియమించారని ఆరోపణలు వచ్చాయి. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా పృథ్వీని ఈ విషయం గురించి మందలించాడని తెలుస్తోంది. టీటీడీ ఉద్యోగులు పృథ్వీ ఇద్దరు మహిళలను ట్రాప్ చేశాడని ఆరోపణలు చేస్తున్నారు. అమరావతి రైతుల విషయంలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపిన వివాదం మరవకముందే పృథ్వీ ఆడియో టేపులకు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
పృథ్వీ ఇప్పటికే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినప్పటికీ పృథ్వీపై విమర్శలు మాత్రం తగ్గటం లేదు. పృథ్వీ రాజీనామా చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ మహిళలతో అసభ్యంగా మాట్లాడానని చెప్పిన ఆరోపణలను ఖండించారు. తాను మద్యం తాగానో లేదో రక్తాన్ని పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. తాను మహిళలతో అసభ్యంగా మాట్లాడానని ప్రూవ్ అయితే చెప్పు తీసుకొని కొట్టండని పృథ్వీ అన్నారు. వైసీపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని ఆ సిద్ధాంతాలకు కట్టుబడి తాను రాజీనామా చేశానని పృథ్వీ అన్నారు. పదవి వచ్చిన రోజు నుండి కంటి మీద కునుకు లేకుండా పని చేశానని తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానని పృథ్వీ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: