చంద్రబాబునాయుడుకు కేంద్రప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది.  దశాబ్దాలుగా చంద్రబాబుకున్న బ్లాక్ క్యాట్ భద్రతను తొలగించాలని కేంద్ర హోంశాఖ డిసైడ్ చేసింది. దేశంలోని 130 మంది ప్రముఖులకు నేషనల్ సెక్యూరిటి గార్డ్స్  (ఎన్ఎస్జి) రూపంలో బ్లాక్ క్యాట్ భద్రత ఉంది. వివిధ కారణాల వల్ల ప్రముఖులందరికీ బ్లాక్ క్యాట్ భద్రతను ఉపసంహరించాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది.  కాబట్టి  2003 నుండి చంద్రబాబును అంటిపెట్టుకునున్న ఎన్ఎస్జీ భద్రత కొద్ది రోజుల తర్వాత నుండి కనబడదు.

 

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే  చంద్రబాబు భద్రతా విషయంలో పెద్ద వివాదమే రేగింది. తనకున్న భద్రతను జగన్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే తగ్గించేసిందంటూ ఎంత యాగీ చేశారో అందరికీ తెలిసిందే.  నిజానికి బ్లాక్ క్యాట్స్ భద్రత కాకుండానే మూడు షిఫ్టుల్లో అంటే 24 గంటలూ చంద్రబాబు ఇంటెలిజెన్స్+ రాష్ట్ర రెగ్యుల్ పోలీసులు సుమారు 90 మంది భద్రత కల్పిస్తున్నారు.

 

ఇంత భద్రతున్న తనకు ప్రభుత్వం కావాలనే భద్రతా సిబ్బంది సంఖ్యను తగ్గించేసిందంటూ గోల మొదలుపెట్టారు. చంద్రబాబుకు భద్రత తగ్గించలేదని ప్రభుత్వం మొత్తుకున్న వినకుండా చంద్రబాబు హై కోర్టులో కేసు కూడా వేశారు. మొత్తానికి విచారణ సందర్భంగా భద్రత కుదించలేదని కోర్టు కూడా అభిప్రాయపడింది.

 

సరే కోర్టు ప్రభుత్వానికి మద్దతుగానే  అభిప్రాయపడినా చంద్రబాబు మాత్రం ఇప్పటికీ తన భద్రత విషయంలో చెలగాటమాడుతోందనే గోల చేస్తుంటారు. అంటే ప్రతి విషయాన్ని బూతద్దంలో చూడటం నానా యాగీ చేయటం చంద్రబాబుకు అలవాటు. చంద్రబాబు ఎప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా తనకున్న మీడియా దన్నుతో ఇదే విధంగా యాగీ చేస్తుంటారు.

 

మరిపుడు బ్లాక్ క్యాట్ భద్రతను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై చంద్రబాబు ఏమంటారు ? ఏమంటారు నోరు మూసుకు కూర్చుంటారు. బ్లాక్ క్యాట్ భద్రత ఉపసంహరణపై ఏమన్నా మాట్లాడితే నరేంద్రమోడి, అమిత్ షా లపైనే ఆరోపణలు చేయాల్సుంటుంది. అదే జరిగితే  వాళ్ళకు మండకుండా ఉంటుందా ? వాళ్ళకు మండితే చంద్రబాబుకూ మూడుతుంది. చూద్దాం ఉపసంహరణ తర్వాత ఏం మాట్లాడుతారో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: