మ‌రోమారు నేడు తెలుగు రాష్ర్టాల సీఎంల భేటీ జ‌ర‌గ‌నుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. ఇప్పటికే రెండుసార్లు భేటీ అయిన తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇప్పుడు మూడోసారి కలిసేందుకు సిద్ధమయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క అంశాలు చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విభజన సమస్యలను పరిష్కరించుకొనేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు అప్పటి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ చొరవతో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి అనువైన వాతావరణ ఏర్పడింది. 2019లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. వారితో గవర్నర్‌ ప్రాథమికంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకొచ్చారు. ఖాళీగా ఉన్న సచివాలయ భవనాలను సీఎం కేసీఆర్‌ కోరిక మేరకు తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ సీఎం జగన్‌ సుముఖత వ్యక్తంచేశారు. ఆ వెంటనే సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించారు. అనంతరం విభజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2019 జూన్‌ 11వ తేదీన నాటి గవర్నర్‌కు ఏపీ సీఎం జగన్‌ లేఖరాశారు. స్పందించిన గవర్నర్‌.. విభజన సమస్యలను మంచి వాతావరణంలో పరిష్కరించుకోవాలని కోరు తూ 2019 జూన్‌ 12న ఇరురాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. తరువాత ప్రగతిభవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశాలు రెండుసార్లు జరిగాయి.

 

కాగా, కీల‌క‌మైన కృష్ణా-గోదావ‌రి న‌దుల అనుసంధానంపై అంద‌రి దృష్టీ ప‌డింది.  వీలైనంత తక్కువ భూసేకరణతో, తక్కువ నష్టంతో గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానం చేయాలని గ‌త స‌మావేశాల్లో ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణకు తరలించే విషయంతోపాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు ఇతర అంశాలపైనా ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు నాలుగుగంటలపాటు ఈ చర్చ జరిగింది. గోదావరి నీటిని కృష్ణకు ఎక్కడ నుంచి, ఎలా తరలించాలి? అలైన్‌మెంట్ ఎలా ఉండాలి? అనే విషయాలు చర్చించారు. జలాల తరలింపు, నీటి వినియోగం ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండాలని, దీనికోసం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: