అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి శెలవులు అయిపోగానే రాజధాని తరలింపు విషయంలో కోర్టులో కేసు వేయాలని డిసైడ్ అయ్యారు. నేతలతో రోజు వారీ మాట్లాడే టెలికాన్ఫరెన్సులో  మాట్లాడుతూ కోర్టులో కేసు వేసే విషయంపై చర్చించినట్లు సమాచారం. రాజధానిని అమరావతి నుండి తరలించటానికి అవకాశం ఉన్నన్ని మార్గాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చెప్పారట.

 

మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు ఇప్పటికే చంద్రబాబు అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ఎంత రచ్చ చేస్తున్నది అందరూ చూస్తున్నదే. రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల్లో భూములిచ్చినా  ఇపుడు గోల జరుగుతున్నది మాత్రం కేవలం ఐదారు గ్రామాల్లో మాత్రమే అన్న విషయం తెలిసిందే.  రాజధాని గ్రామాల్లోనే అందరూ తనతో కలిసి రాకపోవటంతో  చంద్రబాబుకు షాక్ తగిలినట్లైంది.

 

దాంతో ఏమి చేయాలో అర్ధంకాని చంద్రబాబు చివరకు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల ప్రజలను కూడా రెచ్చగొట్టే కార్యక్రమంలోకి దిగారు. అందుకనే మచిలీపట్నం, తిరుపతి, రాజమండ్రి, నరసరావుపేట లాంటి ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. పనిలో పనిగా రాజధాని ఉద్యమం కోసం అవసరమైన విరాళాలను జోలె పట్టి జనాల నుండి సేకరిస్తున్నారు.

 

రాష్ట్రమంతా జోలె పట్టి విరాళాలు ఎందుకు సేకరిస్తున్నారంటే అమరావతిని తరలించకూడదని అన్నీ ప్రాంతాల జనాలు బలంగా కోరుకుంటున్నారని మరో డ్రామా ఆడటానికే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారు. జోలెపట్టటంలో భాగంగా ముందుగా జనసేన, సిపిఐ లాంటి చిన్నా చితక పార్టీల నేతలను కూడా కలుపుకున్నారు. తనకు మద్దతిచ్చే పార్టీలతో ఐక్య కార్యాచరణ సమితి పేరుతో  పెద్ద రచ్చే చేస్తున్నారు.

 

సరే ఏ మార్గంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉపయోగం కనబడటం లేదని అనుకున్నారో ఏమో ? అందుకనే కోర్టులో కేసు వేయాలని కూడా డిసైడ్ అయ్యారు. మరి కోర్టులో కేసు వేసినంత మాత్రాన ఉపయోగం ఉంటుందా ? నిజానికైతే ఉండదనే చెప్పాలి. ఎందుకంటే రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలోనిదన్న విషయం తెలిసిందే. కాకపోతే  నాలుగు రోజులు గోల చేయటానికి ఉపయోగపడుతుందంతే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: