ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తోంది. హై పవర్ కమిటీ మూడో సారి ఈరోజు సమావేశం కానుంది. హై పవర్ కమిటీ ఇప్పటివరకు జరిపిన సమావేశాల్లో బోస్టన్ కమిటీ, జీ.ఎన్. రావు కమిటీ నివేదికల గురించి చర్చించింది. హైపవర్ కమిటీ ఈ నెల 20వ తేదీన ప్రభుత్వానికి నివేదిక అందించబోతుంది. ఆ తరువాత కేబినేట్ భేటీలో ఏపీ రాజధాని గురించి ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుందని సమాచారం.
 
ఒకవైపు రాజధాని అమరావతిలో రైతుల ఆందోళన తీవ్రం అవుతూ ఉండటం, చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరిస్తూ ఉండటం మొదలైన పరిణామాలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ప్రభుత్వం కూడా అధికారికంగా వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని యోచిస్తోంది. ఈ నెల 23వ తేదీన హై పవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో రాజధాని మరియు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. 
 
ఈ నెల 18వ తేదీన రాష్ట్ర కేబినేట్ సమావేశం జరగనుంది. జీఎన్ రావు కమిటీ ఇప్పటికే అభివృద్ధి వికేంద్రీకరణకు మొగ్గు చూపిన విషయం తెలిసిందే. హై పవర్ కమిటీ ఇప్పటికే రెండు సార్లు సమావేశం కాగా ఈరోజు మూడోసారి సమావేశం కానుంది. తొలి సమావేశంలో బీసీజీ ప్రతినిధులతో భేటీ అయిన కమిటీ రెండో సమావేశంలో ఉద్యోగులకు కల్పించాల్సిన సదుపాయాల గురించి ప్రధానంగా చర్చ జరిపింది. 
 
ఈరోజు సమావేశంలో చాలా అంశాలపై స్పష్టత రానుందని ప్రధానంగా సచివాలయ ఉద్యోగుల గురించి, రైతుల ఆందోళనల గురించి చర్చ జరగనుందని తెలుస్తోంది. రాజధాని రైతులకు ఏ రకమైన హామీ ఇవ్వాలో వారికి ఏ రకంగా ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలనే అంశం గురించి చర్చ జరగనుంది. సచివాలయ ఉద్యోగుల ముందు కూడా కమిటీ కొన్ని ప్రతిపాదనలు పెట్టబోతుందని సమాచారం. ఈరోజు కూడా ఈ ప్రతిపాదనల గురించి చర్చించి కమిటీ కొన్ని కీలకనిర్ణయాలను తీసుకోబోతుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: