వైసిపి మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా మంగళగిరి పట్టణంలో  భారీ ర్యాలి నిర్వహించిన ఎంఎల్ఏను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలో అమలులో ఉన్ని నిషేధాజ్ఞ లను  ఉల్లంఘించి ఎంఎల్ఏ భారీ ర్యాలి చేయటంతో పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాలోని పెనుమాక నుండి తాడేపల్లిలోని భారతమత విగ్రహం వరకూ ఎంఎల్ఏ ఆధ్వర్యంలో భారీ ర్యాలి జరిగింది.

 

ర్యాలిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మరీ ఆళ్ళ ర్యాలి తీయటం వివాదానికి దారితీసింది. సరే ర్యాలి సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ర్యాలి సగంలో ఉండగానే పోలీసులు ఎంఎల్ఏలను అదుపులోకి తీసుకున్నారు.

 

ఎంఎల్ఏను పోలీసులు అదుపులోకి తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తు యువత, మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు బలవంతంగా ఆళ్ళను బస్సుల్లోకి ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే తమకు ఎవరైనా ఒకటే అని పోలీసులు నిరూపించారు.  ఇప్పటికే  ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్న టిడిపి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేయటాన్ని చంద్రబాబు అండ్ కో గోల చేస్తున్నారు.

 

మొత్తానికి పోలీసులు విధించిన 144 సెక్షన్, పోలీసు యాక్ట్ 30 ను ఎవరు ఉల్లంఘిస్తున్నా పోలీసులు ఉపేక్షించటం లేదన్నది వాస్తవం. అలాంటిది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబు, టిడిపి నేతలు పదే పదే పోలీసులను టార్గెట్ గా చేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

ఈ నేపధ్యంలోనే మంగళగిరి నియోజకవర్గం అంటే రాజధాని గ్రామాలున్న నియోజకవర్గంలో వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డినే పోలీసులు అరెస్టు చేయటం సంచలనంగా మారింది. ఆళ్ళతో పాటు ర్యాలీ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన మరికొందరు మద్దతుదారులను కూడా పోలీసులు అరెస్టు చేయటంపై  పార్టీలో చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: