అమరావతి రాజధాని గ్రామాల విషయంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల నుండి రాజధాని పరిధిలోని 29 గ్రామాలను మినహాయించాలని పంచాయితీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. సర్పంచు ఎన్నికలు లేదా ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు ప్రశాంతంగా  నిర్వహించేందుకు పరిస్ధితులు అనుకూలంగా లేదని జగన్ భావిస్తున్నారట.

 

ఇదే విషయాన్ని మంత్రి, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో జగన్ చర్చించారు. ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని వ్యక్తం చేయటంతో వెంటనే పంచాయితీ రాజ్ శాఖ ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాసేసింది. ఈ విషయం ఇలాగుంటే మొత్తం 29 గ్రామాలను మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటిల్లో కలపాలనే ప్రతిపాదన కూడా నలుగుతోంది. అంతే కాకుండా అమరావతి గ్రామాలతో పాటు పై రెండు నియోజకవర్గాలను కలిపి అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

 

ఇన్ని ప్రతిపాదనల మధ్య అందులోను రాజధాని తరలింపు గందరగోళం మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.  అందుకనే ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. గతంలో అమరావతి అభివృద్ధికి స్మార్ట్ సిటి పథకం క్రింద కేంద్రం కూడా నిధులు కేటాయించింది. రాష్ట్రప్రభుత్వం నుండి ప్రతిపాదనలు అందగానే విడతల వారీగా నిధులు విడుదలకు కేంద్రం రెడీగా ఉంది.

 

నిజానికి ఈ 29 గ్రామాలను కలిపి ఓ మున్సిపాలిటిగానో లేకపోతే పై రెండు నియోజకవర్గాల్లోనో చంద్రబాబునాయుడు ప్రభుత్వమే కలిపుండాల్సింది. అదీ గాకపోతే పై రెండు నియోజకవర్గాలు, 29 గ్రామాలను కలిపేసి ఓ కార్పొరేషన్ గా చేసి టిడిపి హయాంలోనే డెవలప్మెంట్ జరిగుండాల్సింది. కానీ ఈ విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. అందుకనే ఇపుడు జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ఎన్నికల నిర్వహణపై  ప్రభుత్వం రాసిన లేఖకు ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: