రాజధానిపై అభిప్రాయాలు చెప్పాలని హైపవర్ కమిటీ అమరావతి రైతులకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్న కమిటీ.. టీడీపీ అధినేత చంద్రబాబు మాయలో పడొద్దని కోరింది. చంద్రబాబు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అమాయకులైన రైతుల్ని రెచ్చగొడుతున్నారని మండిపడింది. 

 

ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల అభివృద్ధిపై హైవపర్ కమిటీ చర్చించింది. జిల్లాల అభివృద్ధిపై హైపవర్‌ కమిటీలో చర్చించామని.. ఈనెల 17న మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాజధాని రైతులు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో.. రాతపూర్వకంగా సీఆర్డీఏ కమిషనర్‌కు 17లోగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మెయిల్‌ ద్వారా సూచనలు, సందేహాలు పంపాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసం ఇతర ప్రాంతాల మహిళలను వాడుకుంటున్నారని.. ఈ ప్రాంతం కాని వారిని, మహిళలను తీసుకొచ్చి.. రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సానుభూతి కోసం ప్రీప్లాన్డ్‌గా రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేందుకు ధర్నాలు ప్లాన్ చేస్తున్నారన్నారు. వీటి వెనక టీడీపీ ఉందని తెలిపారు.

 

ఏం జరగబోతుందనేదానిపై రైతులకు ఓ క్లారిటీ ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆ 29 గ్రామాల్లోని నిజమైన రైతులకు అర్థమైందని తెలిపారు. ఆందోళనల్లో అందరూ ఉన్నారని.. అయితే రైతులతో పాటు రాజకీయంగా ప్రేరేపించిన వాళ్లు కూడా పాల్గొంటున్నారన్నారు. రాజకీయంగా సానుభూతి పొందడానికి.. ముందస్తు ప్రణాళికతో నిరసనలు చేస్తున్నారన్నారు. పోలీసులను రెచ్చగొట్టేందుకు.. పద్ధతి ప్రకారంగా చేస్తున్నారు. తాము రైతుల గురించి చర్చించని రోజు లేదని.. రైతులతో చర్చలు జరుపుతున్నామన్నారు. రైతులు వ్యక్తిగతంగా కూడా కలుస్తున్నారని తెలిపారు. టీడీపీ ప్రేరేపిత బృందాలు దాడులు చేస్తాయనే భయంతో వారి బాధలను, ప్రతిపాదనలను తెలుపుతున్నారన్నారు.

 

రాజధాని రైతులపై ప్రతి సమావేశంలోనూ చర్చిస్తున్నామని చెప్పారు మంత్రులు. ఈ నెల 17న హైపవర్ కమిటీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 20న అసెంబ్లీ సమావేశం ఉంటుందన్న ఊహాగానాలతో.. 17నే హైపవర్ కమిటీ నివేదిక ఫైనల్ అయ్యే  ఛాన్స్ ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: