ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖలో ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అడుగులు పడుతున్నాయి. రుషికొండ ఐటీ పార్క్ కేంద్రంగా సచివాలయం, సీఎం కార్యాలయాల నిర్వహణకు భవనాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు  సెజ్ పరిధిలో వున్న ఐటీ హిల్స్-3 ను డీ నోటిఫై చేయించే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.


సుందర సాగర తీరం..! కాస్మొపాలిటన్‌ హంగులు...! ఎన్నెన్నో ఆకర్షణలు..! ఇదీ విశాఖ..!. దేశంలోనే అతికొద్ది నగరాలకు ఉన్న ప్రత్యేకతలు దీని సొంతం. అందుకే ... పోర్ట్ సిటీని ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వహక రాజధానిగా ప్రభుత్వం ప్రతిపాదించింది. రుషికొండ ఐటీ పార్క్ కేంద్రంగా సెక్రెటరీయేట్, సీఎం కార్యాలయం నిర్వహణకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిల్ నెంబర్-3లో ఉన్న మిలీనియమ్ టవర్స్ 1&2ల్లో సచివాలయం...దానిని ఆనుకునే వున్న ఇన్నోవేషన్ టవర్స్ సీఎం కార్యాలయ నిర్వహణకు అనుకూలమైనదిగా అధికారులు గుర్తించారు. పరిపాలన కార్యకలాపాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దడంతో పాటు భద్రతపరమైన చర్యలపైన దృష్టిసారించారు. హెచ్‌ఓడీ కార్యాలయాలకు తగ్గట్టుగా  నిర్మాణంలో మార్పులు చేయాలని ఏపీఐఐసీ ఆదేశించింది.

 

సముద్రానికి అభిముఖంగా.....భీమిలి బీచ్ రోడ్డులోని రుషికొండ ప్రాంతంలో మూడు కొండలపై ఐటీ పార్కు ఏర్పాటైంది. హిల్ నెంబర్ 1లో మిరాకిల్‌,  ఫ్లూయెంట్‌ గ్రిడ్‌ కంపెనీలు నడుస్తున్నాయి. హిల్‌ నెంబర్-2లో 14 ఐటీ కంపెనీలకు భూములు కేటాయించారు. హిల్ నెంబర్-3లో  90ఎకరాల స్థలం ఉంది. ఐబీఎంతో పాటు మరో 13 కంపెనీల కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ కొండపైనే స్టార్టప్‌ విలేజ్‌, మిలీనియం టవర్‌-1, టవర్‌-2 ఉన్నాయి. ఇక్కడి నుంచే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చింది. ప్రభుత్వం ప్రతిపాదనల నేపథ్యంలో ఇటీవల ఐటీ సెక్రెటరీ కోనశశి ధర్ రుషికొండ ఐటీ పార్క్ ను సందర్శించారు. కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఐటీ కంపెనీల్లో ఎంత ప్రాంతం ఖాళీగా వుంది. అక్కడ ఎటువంటి ఆఫీసులకు అనుకూలం వంటి వివరాలను సేకరించి వెళ్ళారు. ఐటీ హిల్స్ అయితే రాజధాని నిర్వహణకు అన్ని విధాలుగా అనుకూలమని...ప్రభుత్వం సంప్రదిస్తే తమ సంస్ధల్లో ఖాళీ భాగాలను ఇచ్చేందుకు సిద్ధమని ఐటీ కంపెనీ నిర్వహకుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు.

 

ఐటీ పార్క్ ప్రత్యేక ఆర్ధిక మండలి కిండ ఏర్పడింది. వీటిలోని హిల్ 1&2 ఇప్పటికే డీ నోటిఫై అవ్వగా...హిల్ నెంబర్ 3పై నిర్మించిన మిలీనియమ్ టవర్స్, ఇన్నోవేషన్ టవర్స్ మినహా మిగిలిన ప్రాంతం అంతా సెజ్ పరిధిలో కొనసాగుతోంది. హిల్ నెంబర్ -3ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలంటే డీ నోటిఫై చేయడం తప్పనిసరి. అప్పుడు మాత్రమే రాష్ట్ర పరిధిలో వుండే కార్యనిర్వహక వ్యవస్ధకు అధికారం లభిస్తుంది. సెజ్ ను డీ నోటిఫై చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం ప రిధిలోనిది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రాకతో హిల్ నెంబర్-3ని నాన్ సెజ్ గా మార్పులు చేసేందుకు అధికారు లు సిద్ధపడుతున్నారు. కేంద్రం అంగీకరిస్తే నెలరోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది.

 

రాజధాని కోసం నిర్మాణాలు ప్రారంభిస్తే కనీసం రెండేళ్ళ సమయం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకూ ఐటీ హిల్స్ కేంద్రంగా పాలన సాగించడమే ఆర్ధిక పరిస్ధితుల దృష్ట్యా బెస్ట్ అనే భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మిలీనియమ్ టవర్స్ తో పాటు ఇతర ఐటీ కంపెనీల్లో వున్న సంస్ధలను నగరం నడిబొడ్డున వున్న విప్రో, మహీంద్రా టవర్స్ ప్రాంగణాల్లోకి తాత్కాలికంగా మార్చేందుకు ఉన్న వెసులుబాటును అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: