తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మ‌రోమారు ఇవాళ తెలంగాణ సీఎం కార్యాల‌య‌మైన ప్రగతి భవన్‌లో స‌మావేశం అయ్యారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్ ఉండగా..ఏపీ సీఎం జగన్ తో ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అయితే, ఈ భేటీలో ఓ సెల్ఫీ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదే ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రియు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, కేసీఆర్ న‌మ్మిన‌బంటు అనే పేరున్న వ‌దిన కుమారుడు సంతోష్ క‌లిసి తీసుకున్న సెల్ఫీ.

 

 

పార్టీ పార్ల‌మెంట‌రీ ప‌క్ష‌నేత‌, ఎంపీ విజయసాయిరెడ్డితో క‌లిసి ఏపీ సీఎం జగన్ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు విచ్చేసిన సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రు సీఎంల‌ స‌మావేశానికి కొద్ది సేప‌టి ముందు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఆయ‌న సోద‌రుడు, రాజ్య‌స‌భ సభ్యుడు అయిన సంతోష్‌కుమార్ క‌లిసి ఏపీ సీఎం జ‌గ‌న్‌తో సెల్ఫీ తీసుకున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశం సంద‌ర్భంగా తీసుకున్న ఈ సెల్ఫీ సోష‌ల్ మీడియాలో ఇటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అటు వైసీపీ శ్రేణులు వైర‌ల్ చేస్తున్నాయి. 

 

కాగా, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలతో పాటు... ఇరిగేషన్, ఇతర అంశాలపై ముఖ్యమంత్రులిద్దరూ ఇటీవలి కాలంలో చర్చించారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఉమ్మడిగా చేపట్టాలని నిర్ణయించారు. దీనికి అయ్యే ఖర్చును రెండు రాష్ట్రాలు భరించాలని అంగీకారానికి వచ్చారు. సమస్యల పరిష్కారానికి కలిసి నడవాలని భావించారు.  కేంద్రానికి సంబంధించిన అంశాలపై కూడా ఉమ్మడిగా వెళ్లాలని అనుకున్నారు. దీనికి కొనసాగింపుగా సంక్రాంతి పండుగ వేళ ముఖ్యమంత్రుల సమావేశం రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేసే శుభవార్త అందించేందుకు ఈ స‌మావేశంలో ప‌లు నిర్ణ‌యాలు వెలువ‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: