అమెరికాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకాలని ఇరాన్ భావిస్తోందా? చర్చలకు అమెరికా కూడా రెడీ గానే ఉందా? జరుగుతున్న పరిణామాలేం చెప్తున్నాయి? అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్లేనా..?

 

ఇరాన్ మేజర్ జనరల్ సులేమానీ హత్య తరువాత పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ట్రంప్ ఇప్పటికీ ఇరాన్ తో చర్చలకు సిద్ధంగానే ఉన్నారని అమెరికా రక్షణశాఖ మంత్రి ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా ఇరాన్‌ తో సమావేశానికి అమెరికా ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ఆంక్షలు ఎత్తివేస్తేనే తాము చర్చలకు వస్తామని ఇరాన్ వాదిస్తోందన్నారు. ఇరాన్‌ తో ఒప్పందానికి తానెప్పుడూ సిద్ధమేనని ట్రంప్ పలుసార్లు ప్రకటించారు.

 

మరోవైపు ఆదివారం ఇరాన్ అధ్యక్షడు హసన్ రౌహానీతో ఖతార్ రాజు షేక్ తామిమ్ బిన్ హమద్ అల్-థానీ భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సద్దుమణగాలంటే తాజా ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలన్న విధానానికి ఇరాన్ అంగీకరించిందని వెల్లడించారు. పశ్చిమాసియా ప్రాంత భద్రతను దృష్టిలో ఉంచుకొని మరింత విస్తృత స్థాయి సంప్రదింపులు, సహకారాన్ని కొనసాగించేందుకు రౌహానీ అంగీకరించారన్నారు. అలాగే బుధవారం అమెరికా స్థావరాలపై ఐఆర్జీసీ జరిపిన క్షిపణి దాడులు అక్కడి సైనికుల్ని చంపాలనే ఉద్దేశంతో చేయలేదని ఇరాన్ అంటోంది.

 

మరోవైపు ఉక్రెయిన్ విమానాన్ని పొరపాటున తామే కూల్చామని ఇరాన్ ఇప్పటికే అంగీకరించింది. 83మందిని ఇరానీలను బలితీసుకున్న ఈ ఘటనలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలు చెలరేగాయి. వీటిని అదుపు చేసే క్రమంలోనే ఇరాన్ పోలీసులు బ్రిటన్ రాయబారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం నుంచి ఇరాన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలోనూ ఇరాన్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

మరోవైపు ఆందోళనకారులను చంపొద్దని ట్రంప్ ఇరాన్‌ ని హెచ్చరించారు. అమెరికా విధించిన ఆంక్షలు, సొంత దేశంలో ఆందోళనలతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోందని, చర్చలకు రావాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికా భావిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: