ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు జరుగుతున్నాయి. రాజధాని ప్రాంతం పెనుమాకలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భారీ ర్యాలీలు తీశారు. ఆర్కే నిషేధాజ్ఞలు ఉల్లంఘించారన్న కారణంతో.. పోలీసులు అరెస్ట్ చేసినా.. తర్వాత వదలిపెట్టారు. 

 

రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ర్యాలీ చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వరకు రామకృష్ణారెడ్డి ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. కానీ పాదయాత్ర చేసేందుకు ఎమ్మెల్యే భీష్మించడంతో.. రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి పోలీసు వాహనంలో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 

చట్టాన్ని తాము గౌరవిస్తామని చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. చంద్రబాబు గత 25 రోజులుగా ఈ ప్రాంతంలో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. సెక్షన్ 144, సెక్షన్ 30ని పదే పదే ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. పరిపాలన వికేంద్రీకరణతో పాటు మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ... తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఇందులో వేలాదిగా వైసీపీ కార్యకర్తలు, మద్దతు దారులు పాల్గొన్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని నినదించారు. 

 

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. మూడు రాజధానులకు మద్దతుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేపట్టిన పాదయాత్రను అంతకుముందు పోలీసులు అడ్డుకున్నారు. వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి ఫలాలు అందరూ పొందాలి నినాదంతో పెనుమాక నుంచి ఆర్కే పాదయాత్ర ప్రారంభించగా, అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున పాదయాత్రకు అనుమతి లేదంటూ అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధికి అన్ని వైపులా విస్తరించాలని కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: