కాంగ్రెస్,  బిజెపిలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నాయని టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  అన్నారు. తెలంగాణ పెన్షన్లలో కేంద్రం వాటా గురించి బీజేపీ నేతలు సోషల్ మీడియా లో చేస్తున్న  తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన,  టీఆరెస్ సోషల్ మీడియా వింగ్ కు  దిశా నిర్దేశం చేశారు .  కాంగ్రెస్ హయం లో మున్సిపాలిటీలకు నిధులు ఎక్కువ విడుదల అయ్యాయంటున్న టీపీసీసీ అధ్యక్షుడు  ఉత్తమ్ కూమార్ రెడ్డికి దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలని  సవాలు చేశారు .  2004 నుంచి 2014 మధ్య విడుదల చేసిన నిధుల కంటే గత ఐదేళ్లలో రెట్టింపు నిధులు  మున్సిపాలిటీలకు విడుదల చేశామని తెలిపారు.

 

మున్సిపల్ ఎన్నికల నేపధ్యం లో సోషల్ మీడియా వేదిక అధికార పార్టీ పై ప్రతిపక్ష కాంగ్రెస్ , బీజేపీ లు దుమ్మెత్తి పోస్తున్నాయి . టీఆరెస్ పాలనలో అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించడమే  కాకుండా, నిధులు దారిమళ్లించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి . మున్సిపోల్స్ లో అధికార పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలన్న కసితో ఉన్న విపక్షాలు సోషల్ మీడియా లో చేస్తున్న హడావుడిపై కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు . తమ పార్టీకి ఇతర పార్టీల మాదిరి పెయిడ్ సోషల్ మీడియా బలగం లేదన్న ఆయన ,  వివిధ సామాజిక మాద్యమాల్లో లక్షలాది మంది కార్యకర్తలున్నారని, కేవలం ఫేస్ బుక్ లోనే 11 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పారు .

 

 ఏ పార్టీకూడా సోషల్ మీడియా లో  టీఆరెస్ కు దరిదాపుల్లో లేదన్నారు. ప్రతిపక్షాల అసత్య అరోపణలను, విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ఆయన పార్టీ సోషల్ మీడియా వింగ్ కు కార్యకర్తలకు పిలుపునిచ్చారు . ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి అవసరం అయిన ప్రచారాన్ని పార్టీ సోషల్ మీడియా విభాగం  మరింత ఉదృతం చేయాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: