గతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండేది . కానీ ఆంధ్ర ప్రదేశ్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణి పెరిగింది . రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలజగడల పరిష్కారం దిశగా ఇప్పటికే అడుగులు వేసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ , జగన్ ... ఇప్పుడు నదుల అనుసంధానమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు . వీరిద్దరి ప్రయత్నం ఫలిస్తే వృధాగా గోదావరి లో కలుస్తున్న జలాలతో  ,రెండు రాష్ట్రాల్లోని  బీడు భూములు తడిచే అవకాశాలు లేకపోలేదు .

 

సోమవారం ప్రగతిభవన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య  సుదీర్ఘ  సమావేశం జరిగింది  . ఈ భేటీ లో ప్రధానంగా కృష్ణానది లో నీటి లభ్యత ప్రతి ఏడాది స్థిరంగా ఉండకపోవడం వల్ల , పుష్కలంగా నీటి లభ్యత ఉన్న గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు తరలించాలని నిర్ణయించారు . దీని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి మేలు జరుగుతుందని ఇరువురు ముఖ్యమంత్రులు పేర్కొన్నారు . ఇప్పటికే ఎనిమిది మార్లు సమావేశమైన తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు , తొమ్మిదవసారి సుమారు ఆరు గంటల సేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు . గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు ఎలా తరలించాలనేదానిపై మరోమారు సమావేశం కావాలని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించారు .

 

మరుసటి  సమావేశం లో గోదావరి జలాల తరలింపు  మోడల్ ఎలా ఉండాలన్నదానిపై విపులంగా చర్చించి ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు . అదే సమయం లో రాష్ట్ర విభజన చట్టంలోని 9 , 10 షెడ్యూల్ లోని పలు అంశాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ , జగన్ చర్చించినట్లు తెలుస్తోంది .9 , 10 షెడ్యూల్ లోని సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే సమావేశం కావాలని రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శులను ముఖ్యమంత్రులు ఆదేశించారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: