మన కోసమే మనం జీవిస్తాం.. మనం.. మన కుటుంబం..ఇంతే మన ప్రపంచం. మహా అయితే మన బంధువులు. ఇంకాస్త విశాల హృదయులైతే.. మన స్నేహితులు.. ఇంత వరకే మన బంధాలు, తాపత్రయాలు. అయితే అంతా మనలానే ఉండరు.

 

కొందరు తమ కోసం కాకుండా.. సమాజం కోసం ఆలోచించేవారు ఉంటారు. మొదటి నుంచి ఆ ధోరణి లేకపోయినా.. ఏదో ఒక క్షణం వారి జీవితాలను మార్చేస్తుంది. అలాంటి వారే చరిత్ర సృష్టిస్తారు. చరిత్రలో నిలుస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైనా నాగాలాండ్ కు చెందిన హెకానీ జకాలూ అనే యువతి కూడా అంతే.

 

ఆమెకు లా అంటే చాలా ఇష్టం. దాని కోసం ఆమె ఫారిన్ వెళ్లి చదివింది. ఆ తర్వాత ఢిల్లీ వచ్చి ఉద్యోగం చేసింది. కానీ ఢిల్లీలో ఎక్కడ చూసినా తమ ఈశాన్య రాష్ట్రాల యువతే కనిపించేది. ఇందుకు కారణం తమ ప్రాంతంలో ఉపాధి లేకపోవడమే అని ఆమెకు అర్థమైంది.

 

అంతే న్యాయవాద వృత్తిని వదిలి తన వారికి ఉపాధి చూపించేందుకు నడుంబిగించింది. యువత స్థానికంగా ఉపాధి పొందేందుకు అవసరమైన స్కిల్ ట్రైనింగ్ కోసం ఆమె ఎన్నారైల సాయంతో యూత్నట్ అనే సంస్థని ప్రారంభించింది. ఈ సంస్థ యువతీ యువకులకు వారి ఆసక్తుల్ని బట్టి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేది.

 

 

వారు తయారు చేసిన వస్తువులకు మేడ్ ఇన్ నాగాలాండ్ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. అలా యూత్నట్ సంస్థ ఆధ్వర్యంలో కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి దొరికింది. అందుకే ఆమె రాష్ట్రపతి నుంచి పురస్కారం సైతం అందుకుంది. ఇప్పుడు హెకానీ జకాలూ నాగాలాండ్ యూత్ ఐకాన్.. అక్కడి యూత్ కు మార్గదర్శి.. ఆమెలా పారిశ్రామిక వేత్తలుగా మారాలని చాలా మంది యూత్ ఆమెను ఆదర్శింగా తీసుకుంటున్నారు. అందుకే మనకు నచ్చింది చేయాలి.. అది పలువురు మెచ్చేదిగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: