అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఓవైపు చంద్రబాబు ఉద్యమం చేస్తున్నారు. కేవలం రాజధాని ప్రాంతంలోనే ఉద్యమం చేస్తే బావుండదని.. ఏకంగా రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. మచిలీపట్నం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురం జిల్లా రాష్ట్రమంతా తిరిగి అమరావతి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదట్లో చప్పగా సాగిన అమరావతి ఉద్యమం ఇప్పుడు కాస్త పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది.

 

అయితే ఇందుకు విరుగుడుగా జగన్ కూడా ఉద్యమాన్ని ఉద్యమంతోనే దెబ్బకొట్టే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే .. అమరావతి ఉద్యమానికి పోటీగా.. ఒక రాజధాని వద్దు..మూడు రాజధానులే ముద్దు అంటూ వైసీపీతో రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు నిర్వహించేలా చేస్తున్నారు. అనేక నగరాల్లో ప్రజలు బయటకు వచ్చి నినదిస్తూ..సీఎం వైయస్‌ జగన్‌ అధికార వికేంద్రీకరణ నిర్ణయాన్ని అభినందిస్తున్నారన్న ఫీలింగ్ వచ్చేలా చేస్తున్నారు.

 

విజయవాడ, తిరుపతి, విజయనగరం, విశాఖ, కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు ఇలాంటి పోటీ ప్రదర్శనలు చేపట్టారు. కింది స్థాయి నాయకులు మాత్రమే కాకుండా మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, అవంతి శ్రీనివాస్‌, భూమన కరుణాకర్‌రెడ్డి వంటి నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 8 నెలల పరిపాలన కాలంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని ప్రజలకు వివరిస్తున్నారు.

 

అభివృద్ధిలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్‌ ఆలోచన అనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. రాజకీయ లబ్ధికోసం రాజధాని ప్రజలను ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొడుతున్నారని వారు వివరిస్తున్నారు. చంద్రబాబుకు ఉదయం లేచిందే మొదలు రాజకీయం కావాలని.. అదే బాటలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా నడుస్తున్నారని వారు ధ్వజమెత్తారు. చంద్రబాబును నమ్మొద్దని..ఆయనది వాడుకుని వదిలేసే నైజం అని..పవన్‌ను కూడా అలాగే చేస్తారని విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి జగన్ ప్రారంభించిన ఈ పోటీ ఉద్యమంతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: