సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లడం ఓ ఆనవాయితీ. అలా కనీసం ఏడాదికి ఒక్కసారైనా జన్మభూమిని సందర్శించుకుంటారు. ఎంత బిజీ అయినా సరే. సంక్రాంతికి వీలు చూసుకుని సొంత గ్రామాలకు చేరుకుంటారు. అది రాజకీయ నాయకుడు అయినా, బిజినెస్ మేన్ అయినా ఉద్యోగి అయినా ఈ సంక్రాంతి షెడ్యూల్ లో మార్పులు ఉండవు.

 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా దీనికి మినహాయింపు కాదు. ఆయన ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు తన సొంత గ్రామమైన చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో జరుపుకుంటారు. అంతే కాదు..అక్కడ కులదైవానికి పూజలు చేస్తారు. తన తల్లిదండ్రుల సమాధులు సందర్శిస్తారు. ఈ కార్యక్రమానికి ఏటా నందమూరి- నారా కుటుంబాలు హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది.

 

అయితే ఈ సంక్రాంతికి మాత్రం ఆ సంబరాలకు దూరంగా ఉంటున్నారు. తాను కలలు గన్న అమరావతి రాజధానిని జగన్ విశాఖకు మారుస్తుండటంతో అమరావతి కోసం ఆయన పోరాడుతున్నారు. ఇందులో భాగంగా సంక్రాంతిని కూడా త్యాగం చేశారు. ప్రతి ఏటా త‌న సొంత ఊరు చిత్తూరులోని నారా వారిప‌ల్లెలో త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి సంక్రాంతిని చేసుకునే టీడీపీ అధినేత చంద్రబాబు .. ఈ ఏడాది మాత్రం అమ‌రావ‌తిలో రైతుల‌తో క‌లిసి జ‌గ‌న్ స‌ర్కారుపై స‌మ‌ర సంక్రాంతి చేయ‌నున్నార‌ు.

 

జీఎన్ రావు కమిటీ, బీసీజీ గ్రూపు కమిటీ సిఫారసులు బయటకు వచ్చిన రోజే చంద్రబాబు ఆవేశంగా స్పందించారు. ఇక రాష్ట్ర ప్రజలు ఈ సంక్రాంతి సంబరాలను అమరావతి సంక్రాంతిగా జరుపుకోవాలని పిలుపు ఇచ్చేశారు. భోగి రోజు భోగి మంటల్లో జీఎన్ రావు కమిటీ రిపోర్టును బీసీజీ గ్రూపు కమిటీ రిపోర్టులను మంటల్లో వేయాలని సూచించారు.

 

అయితే ఈ చంద్రబాబు సమరనాదాలను రాజధాని గ్రామాల రైతుల తప్పించి మిగిలిన జనం పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. మరి చంద్రబాబు ఈ మూడు రోజులు ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: