టీఆర్ఎస్ పార్టీ సోష‌ల్ మీడియాపై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ఈ బాధ్య‌త‌ల‌ను భుజానికి ఎత్తుకున్నారు. ఈ మేర‌కు తెలంగాణభవన్‌లో పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తల సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీపై అభిమానంతో సోషల్‌ మీడియా కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారంటూ కేటీఆర్‌ అభినందించారు. పార్టీకి దాదాపు 11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని.. మిగతా ఏ పార్టీ కూడా టీఆర్‌ఎస్‌కు దరిదాపుల్లో కూడా లేదని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయానికి కృషిచేయాలని, వినూత్న ప్రచారం నిర్వహించడం ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలకు పెయిడ్‌ వర్కర్లు తప్ప అభిమానులు లేరని  అన్నారు. ప్రజల్లో అత్యంత ఆదరణ ఉండే రాజకీయపార్టీకి సామాజిక మాధ్యమం అదనపు బలాన్ని చేకూరుస్తుందని కేటీఆర్‌ తెలిపారు. 

 

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిరోజూ ఎంతోకొంత సమయాన్ని సోషల్‌ మీడియాను చూడటానికి కేటాయిస్తారని, తద్వారా ప్రభుత్వం, పార్టీపై ప్రజల నాడి ఏమిటి.. వారి ఆలోచనలు, అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? అనేది తెలుసుకొంటారని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలు వచ్చాక నేరుగా ప్రజలతో అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పడానికి తనలాంటి వారికి అడ్వాంటేజి లభించిందని కేటీఆర్ చెప్పారు. కొన్ని పార్టీలు ప్రజలమధ్య చిచ్చు పెట్టడానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నాయని ఆరోపించిన కేటీఆర్‌.. టీఆర్‌ఎస్‌ ఎన్నడూ ఉద్రిక్తతలను పెంచడానికి సామాజిక మాధ్యమాన్ని వాడలేదని చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలను మాత్రమే వివరించాలని.. దూషణల పర్వం వద్దని కేటీఆర్‌ సూచించారు. దూషణలను టీఆర్‌ఎస్‌ ఎన్నడూ ప్రోత్సహించదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

 

సోషల్‌ మీడియా కార్యకర్తలకు, పార్టీకి మధ్య సమన్వయం పెరుగాల్సి ఉన్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోషల్‌ మీడియా కార్యకర్తలను అకారణంగా దూషిస్తే వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. సోషల్‌మీడియాలో సంస్కారవంతంగా ప్రచారం చేయాలని సూచించారు. సోషల్‌ మీడియా గులాబీ సైనికులకు గుర్తింపు, గౌరవం ఇస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: