వైసిపి నేతలకు సవాలు విసురుతున్న చంద్రబాబునాయుడు ఆపనేదో తానే చేస్తే జనాలు చాలా సంతోషిస్తారు. ఇంతకీ వైసిపికి విసిరిన సవాలు ఏమిటంటే రాజధాని తరలింపు విషయంలో ముందు 151 మంది ఎంఎల్ఏలు రాజీనామాలు చేసి తర్వాత ఎన్నికల్లో పోటి చేసి గెలిచి అప్పుడు రాజధానిని తరలించాలట. అప్పుడు గనుక వైసిపినే గెలిస్తే తాను రాజకీయాల నుండి శాస్వతంగా తప్పుకుంటాడట.

 

నిజంగా చంద్రబాబు మాటలు విన్న తర్వాత ఆయన మానసిక పరిస్ధితిపై జనాలకు అనుమానాలు పెరుగిపోతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు సవాలును స్వీకరించి ప్రభుత్వాన్ని రద్దు చేసుకునేంత అమాయకులు ఎవరూ వైసిపిలో లేరు. అదే సమయంలో   జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో జనాలు బ్రహ్మండమైన ర్యాలీల్లో పాల్గొంటున్నది చంద్రబాబు చూడటం లేదేమో.

 

జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు జనాలను ఎలా రెచ్చగొడుతున్నారో అదే విధంగా జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా వైసిపి ఎంఎల్ఏలు కూడా ర్యాలీలు తీస్తున్నారు. సరే ఈ విషయాన్ని పక్కనపెడితే  మూడు రాజధానుల నిర్ణయంపై రాజీనామా చేయాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే అమరావతిని రాజధానిగా చేసేటపుడు చంద్రబాబు ఎవరి అభిప్రాయాలు తీసుకున్నారు.

 

అమరావతిని రాజధానిగా చేయబోతున్నట్లు ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పారా ? ఎన్నికల్లో ప్రచారమైనా చేశారా ? పోని గెలిచాన తర్వాత జనాభిప్రాయం సేకరించారా ? ప్రతిపక్షాలతో సమావేశం పెట్టి చర్చించారా ?  కనీసం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి అభిప్రాయమైనా తీసుకున్నారా ? తాను అధికారంలో ఉన్నారు కాబట్టి తనిష్టం వచ్చినట్లు చేసుకుపోయారు.

 

ఇపుడు జగన్ కూడా అదే పద్దతిలో చేసుకుపోతున్నారంటే. అమరావతిని ఎందుకు రాజధానిగా నిర్ణయించింది చంద్రబాబు చెబుతున్నట్లే విశాఖపట్నాన్ని రాజధానిగా ఎందుకు అనుకుంటున్నది జగన్ చెబుతున్నారు.  కాబట్టి  వైసిపి ఎంఎల్ఏలను రాజీనామాలు చేయమని అడిగేముందు టిడిపి ఎంఎల్ఏలు, ఎంపిలతో రాజీనామాలు చేయిస్తే జనాలు సంతోషిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: