తెలంగాణ‌లో జ‌రుగుతున్న మున్సిపల్ ఎన్నికల సీట్ల లొల్లి తారాస్థాయికి చేరుతోంది. ప్రతిరోజూ ఏదో ఒక పార్టీ నాయకులు సీటు ఇవ్వలేదని ఆయా పార్టీలకు రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్ నేత‌ల‌దే అగ్ర‌తాంబూలం. తాజాగా ఓ నాయకుడు పార్టీకి గుడ్‌బై చెప్పేయ‌గా..మ‌రో నాయ‌కుడు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ప‌రిణామాలు క‌ల‌క‌లం రేకెత్తిస్తున్నాయి.

 


మేడ్చల్ మున్సిపాల్టీ 14 వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి  విజయ్ టికెట్ ఇవ్వకపోవడంతో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఒంటిపై పెట్రోలో పోసుకుంటుండగా..పోలీసులు,స్థానికులు అడ్డుకున్నారు. ఆత్మహత్యా యత్నం చేస్తున్న విజ‌య్‌ను అడ్డుకొని పోలీస్ స్టేష‌న్‌కు తరలించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనకు కొందరు నేతలు మోసం చేస్తున్నారని విజయ్ ఆరోపించారు. తనకు అన్యాయం జరిగిందనే  మనస్తాపంతోనే ఆత్మహత్యా యత్నం చేశానన్నాడు.   తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికే టిక్కెట్లు ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం చెప్పినా స్దానిక నాయకులు మాత్రం టిక్కెట్ అమ్ముకుంటున్నారని అన్నారు. తనను 25 లక్షల డిపాజిట్ చూపించమన్నారని.. దళితుడిని అయిన‌ తాను అంత నగదు ఎక్కడ నుంచి తేవాలన్నారు. 

 


మ‌రోవైపు ఇదే జిల్లాకు చెందిన కీసర మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కృష్టారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో నాగారంలోని 8వ వార్డు నుంచి జనరల్ మహిళ కోటాలో తన భార్యకు కౌన్సిలర్ సీటు కోసం కృష్టారెడ్డి ప్రయత్నించాడు. కానీ, టీఆర్ఎస్ నాయకత్వం మాత్రం ఆయనకు ఆ సీటు కన్ఫర్మ్ చేయలేదు. దాంతో ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కీసర మరియు నాగారం మండల పార్టీ ప్రెసిడెంట్లకు లేఖ రాశారు. ఈ రాజీనామ లేఖను జిల్లా అధ్యక్షుడితో పాటూ.. రాష్ట్ర అధ్యక్షుడికి కూడా పంపిస్తానని ఆయన అన్నారు. తనకు బీ ఫారం ఇవ్వకుండా అన్యాయం చేశారని కృష్ణారెడ్డి ఆరోపించారు. 2019 ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కూడా సీటు ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇప్పటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీ ఫారం ఇవ్వకుండా తనను మోసం చేశారని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: