ప్రకృతి రమణీయతను సంతరించుకున్న రాష్ట్రపతి అతిథి గృహం.. బ్రిటీష్ వైశ్రాయ్ నుంచి నేటి ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ వరకు అతిథి మర్యాదలకు నెలవది.. అటువంటి రాష్ట్రపతి అతిథి నిలయం ఎప్పుడూ అక్కడి ప్రజలకు కనువిందు చేస్తూనే ఉంది.

 

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించడానికి నగర వాసులకు మరో అవకాశం వచ్చింది. శీతాకాల విడిది కోసం వచ్చిన రామ్‌నాథ్‌ కోవింద్‌ అక్కడి అందాలను ప్రజలు చూడడానికి అవకాశమిచ్చారు. మనస్సును ఆహ్లదపరిచే ఉద్యానవనాలు, ఔషద మొక్కలు, పచ్చదనంతో నేలను కప్పేసిన పండ్ల, పూల తోటలు రాష్ట్రపతి అతిథి గృహానికి ప్రత్యేక ఆకర్షణ.  

 

మొదటిసారి తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ప్రజలకు అవకాశం కల్పించే విధానానికి శ్రీకారం చుట్టారు. వరుసగా ఐదు సార్లు ఈ నిలయానికి వచ్చిన ప్రతిభాపాటిల్.. అనేక సార్లు ప్రజలకు రాష్ట్రపతి అతిథి గృహాన్ని చూసే అవకాశం కల్పించారు. ఆ ఆనవాయితీని ప్రణబ్‌ ముఖర్జీ కొనసాగించగా.. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

 

1860లో నిజాం నవాబు నజీరుద్దీన్‌ రాష్ట్రపతి నిలయాన్ని నిర్మించారు. 90 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో ఈ భవన సముదాయం ఉండగా.. అందులో మూడు విభాగాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి కుటుంబ సభ్యుల కోసం భాగాలుగా రూపొందించారు. అవి కాక ఆ పరిసర ప్రాంతాల్లో 20 గదులను ఏర్పాటు చేశారు. అక్కడి వంటశాల నుంచి రాష్ట్రపతి నిలయం వరకు ఉన్న సొరంగ మార్గం అద్భుతంగా ఉంటుంది. ప్రధాన ద్వారం, డైనింగ్‌ హాల్‌, ఫౌంటెన్ల గురించి చెప్పాలంటే మాటలు చాలవు.  

 

రోజుకి సగటున వెయ్యి మంది రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించుకుంటారు. ఇండియా ప్రెసిడెంట్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న సందర్శకులు.. భవన అందం వర్ణనాతీతమని అంటున్నారు. మొత్తం మీద.. దేశ ప్రథమ పౌరుడి అతిథి గృహాన్ని చూడటానికి వెళ్లాలనుకుంటే ఈ నెల 17వ తేదినే గడువు. ఉదయం 10 గంటల నుంచి 4గంటల వరకు అనుమతి ఉంటుంది. మరెందుకు ఆలస్యం వెంటనే బొల్లారం వెళ్లడానికి రడీ అవ్వండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: