కొన్ని సంఘ‌ట‌న‌లు విస్మ‌య‌క‌రంగా ఉంటాయి. ఇలా జ‌రుగుతుందా అని ఆశ్చ‌ర్యాన్ని కలిగిస్తుంటాయి. కానీ నిజం నిజ‌మే క‌దా?  అలాంటి చేదు నిజ‌మే ఇది. జ‌మ్ముక‌శ్మీర్‌కు చెందిన పోలీస్ అధికారి దేవిందర్‌సింగ్‌ను వాహ‌నంలో ప్ర‌యాణిస్తుండ‌గా శనివారం ఓ చెక్ పోస్టు వద్ద పట్టుకున్నారు. అయితే, ఆయన తన గుర్తింపును దాచిపెట్టకుండా కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్నట్టు తనిఖీ అధికారులకు చెప్పారు. కానీ పోలీసుల‌కు డౌట్ వ‌చ్చింది. దీంతో అధికారులు వెంటనే ఆ కారులో ప్ర‌యాణిస్తున్న అందరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తే అస‌లు నిజం తెలిసింది. ఉగ్రవాదుల‌తో క‌లిసి ఆయ‌న కారులో ప్ర‌యాణిస్తున్నాడ‌ని, వారికి ఆ అధికారి స‌హ‌క‌రిస్తున్నాడ‌ని తేలింది.

 

నవీద్ బాబు, అల్తాఫ్ అనే ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి ప్రయాణిస్తుండగా దేవిందర్‌సింగ్‌ను శనివారం ఓ చెక్ పోస్టు వద్ద పట్టుకున్నారు. పోలీసు అధికారుల‌కు ప‌ట్టుబ‌డిన త‌ర్వాత దేవింద‌ర్ సింగ్ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చాడు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నాయికూను హతమార్చేందుకు తాను ఉగ్రవాదులతో దోస్తీ చేసినట్టు ఆయన చెప్పాడు. ఈయ‌న కామెంట్ల‌పై విచార‌ణ చేస్తే...ముడుపులు తీసుకుంటూ ఉగ్రవాదులకు వసతి, రవాణా సౌకర్యాలు దేవిందర్ సింగ్ కల్పిస్తున్నట్టు దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది. శ్రీనగర్‌లోని ఇంద్రానగర్‌లో సింగ్ నివాసం నుంచి ఒక ఎకె-47, రెండు పిస్టల్స్, లక్షలాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులకు సాయపడేందుకు సింగ్ రూ.12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని స‌మాచారం. 

 

మ‌రోవైపు ఉగ్రవాదుల అంతం చేసేందుకే తాను ఉగ్ర‌వాదుల‌తో క‌లిశాన‌ని పట్టుబడ్డ పోలీసు అధికారి దేవిందర్ సింగ్ చెప్తున్న కథనంలో నిజం లేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. త‌న వాద‌న‌కు తగిన ఆధారాలేవీ ఆయన సమర్పించలేకపోయారని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో యాంటీ-హైజాకింగ్ విభాగంలో పనిచేస్తున్న దేవిందర్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. ఆయన చెప్తున్నట్టుగా ఉగ్రవాదులకు సంబంధించి రహస్య బాధ్యతలేవీ ఆయనకు పై అధికారులు అప్పగించలేదు. అంతేకాకుండా ఆయన సదరు బాధ్యతల గురించి ఇతరులకు తెలియపర్చనూ లేదు. దీంతో జమ్ముకశ్మీర్ లోఆయనను కూడా ఉగ్రవాదిగానే పరిగణించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఇదివరకు నిర్వర్తించిన డ్యూటీలపై, ఆదాయ వ్యయాలపై లోతైన విశ్లేషణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: