మనిషి జీవితంలో ఎన్నో సాదు జంతువులు... పక్షులతో తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు.  ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత ముఖ్యమో కొన్ని పశు, పక్షాదులకు కూడా అంతే అభిమానాన్ని చూపిస్తుంటారు.  సాధారణంగా కోళ్లగురించి తెలియని వారు ఉండరు.. కోడి మాంసం అంటే ఇష్టపడని వారు ఉండరు.. కోడి గుడ్డు మంచి పౌష్టిక ఆహారంగా తీసుకుంటారు.  ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే పందెం కోళ్లకు ఎంత గిరాకీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  పొందెం కోళ్లతో లక్షలు, కోట్లు సంపాదించే వారు ఉంటే.. ఇళ్లు, ఆస్తులు గుళ్ల చేసుకునే వారు ఉన్నారు.  

 

పందెం కోళ్ళు బరిలోకి దిగాయంటే.. రెక్కలు తెగిపోయినా, కండరాలు చీల్చుకుపోయినా, కుత్తుక నెత్తురోడుతున్నా.. వెన్నుచూపని తెగింపు తెంపరితనం చూపుతూ విజయమో వీరమరణమో తేలేదాకా పోరాడుతూనే ఉంటాయి. చాలా ప్రాంతాల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజులు ఈ కోడి పందాలు లేకుండా గడవవు. సాధారణంగా ఏడాదిన్నర వయసున్న కోడిపుంజును పందాలకు సిద్ధం చేయడం మొదలుపెడతారు. దానికి రెండు మూడు సంవత్సరాల వయసు వచ్చేవరకూ కూడా జాగ్రత్తగా సాకుతూ, జాతిపెట్ట ద్వారా దాని సంతతిని పెంచుతుంటారు. కోళ్లలో జాతులను బట్టి పందాలు కాస్తుంటారు.

 

ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పందాలు కాసేందుకు ఇప్పటి  పందెంరాయుళ్లు తమ కోళ్లతో పందాల్లో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా పుంజుల్లో కాకి, నెమలి, డేగ, సేతువా, పింగళ, మైల, నెమలి కాకి తదితర రకాలకు డిమాండ్‌ ఎక్కువ. ఈ కోళ్లతో పందాల్లో లక్షలు, కోట్లు గడించిన వారు ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ఈ పందెం కోళ్లు బలంగా ఉండేందుకు ఉడికించిన కోడిగుడ్డు, జీడిపుప్పు, బాదం, ఇతర డ్రై ఫ్రూట్స్‌, రాగులు, సజ్జలు ఆహారంగా ఇస్తుంటారు.  కోళ్లతో రన్నింగ్, స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయిస్తు వాటిని పందానికి రెడీ చేస్తుంటారు.  ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే కోళ్ల పందాలే.. అని చెబుతుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: