పార్టీ అంతా వట్టిపోయిందా..? ఓ వైపు అధికార పార్టీతో ఢీ అంటే ఢీ.. అంటూ సవాల్ విసురుతున్నా.. ఆ పార్టీ నాయకులకు పార్టీ నాయకత్వం అంతగా పట్టించుకున్నట్టు లేదు. పార్టీ కండువాలు కప్పుకోవటం...జెండాలు గల్లీ గల్లీకి కనిపిస్తేనే ఎన్నికల హడావుడి అనుకునే నాయకులకు మాత్రం ఓ వెలితి కనిపిస్తోంది. ఎన్నికల గడువు దగ్గర పడుతున్నా.. ప్రచారానికి కనీసం కర పత్రాలైనా ఇవ్వరా..? అనే పరిస్ధితికి వెళ్లింది ఆ పార్టీ కేడర్.!

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అయినా పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. మునుపెన్నడు లేనట్టుగా...పార్టీ ఇంచార్జీలను... పరిశీలకులను నియమించింది. అధికార పార్టీకి అన్ని రకాలుగా ఢీ కొట్టలేకపోయినా... తన వంతు ప్రయత్నాలు మాత్రం చేస్తుంది. కానీ ఆ పార్టీ నాయకులను మాత్రం ఓ విషయం ఇబ్బందిగా మార్చేసింది. హైదరాబాద్ శివారులో ఉన్న కార్పోరేషన్ ఎన్నికలకు ఆయన ఇంచార్జీ. వారం రోజులుగా అక్కడే పనిచేస్తున్నారు. సమస్యలను గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కేడర్ కూడా కొంత యాక్టీవ్ గానే కనిపించారట. కానీ..సార్ పార్టీ జెండాలు, కండువాలైనా ఇప్పించండి అని అడిగారట కేడర్. సాదారణంగా ఎన్నికల్లో గాంధీ భవన్ నుంచి జెండాలు, ఎన్నికలకు సంబందించిన కర పత్రాలు అందించటం సాధారణమే. కానీ ఆ సీనియర్ నాయకుడు గాంధీ భవన్ కి వచ్చి... మా కార్పోరేషన్ కి పార్టీ కండువాలు, జెండాలు పంపించండి...అక్కడేమీ లేవు అని అడిగారట. గాంధీ భవన్లో కూడా జెండాలు కండువాలు లెవ్వు. మీరే చూసుకోవాలి... మాదగ్గరేం లెవ్వు...ఏమీ ఇవ్వటం లేదని సమాధానం ఇచ్చేశారట. అనటానికి ఏమీ లేక... నవ్వుకుంటూ వెళ్లిపోయారు సదరు నాయకుడు.

 

మున్సిపల్ ఎన్నికల్లో ఇరగదీస్తామని నాయకులు చెప్తున్నా... కేడర్ కి కనీసం కండువాలు కూడా పంపటం లేదు. ఇదిలా ఉంటే... కనీసం మేనిఫెస్టో ఇస్తామని ఇప్పటికి పదే పదే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మేనిఫెస్టో ఉంటుందా..? ఉంటే దాన్ని విడుదల చేసినా...ఇంటింటికి ఇప్పటికే పంపిణీ చేసి ఉంటే బాగుండేది అనేది పార్టీ నాయకుల టాక్. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టో కమిటీ రెండు..మూడు సార్లు సమావేశమైతే అయ్యింది కానీ అది ఎంత వరకు వచ్చిందో తెలియదు. కనీసం మేనిఫెస్టో అయినా ఇస్తే జనంలోకి వెళ్లటానికి వీలవుతుందనేది ఒపెన్. ఐతే ఓ సీనియర్ నాయకుడు ముందు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందించారు. ఆయన సలహాలు గనక జనంలో చెప్తే...ఇక జనంలో తిరిగే పరిస్ధితి కూడా ఉండదు అంటు వెళ్లిపోయారు. 

 

కాంగ్రెస్ పార్టీ...గాంధీ భవన్ నుంచి పార్టీ సామాగ్రినైనా పంపిస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు నాయకులు. అసలే మున్పిపల్ ఎన్నికలు అంటేనే ఆర్ధిక భారం అనుకుంటున్న తరుణంలో... క్యాడర్ కి పార్టీ జెండాలే ఇవ్వకపోతే...ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: