తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల విత్ డ్రాకు గడువు ముగిసింది. సీట్లు రానివాళ్లు, పార్టీపై అసంతృప్తులు కన్నీళ్లు పెట్టుకున్న దాఖలాలు చేలా చోట్ల కనిపించాయి. కొన్నిచోట్ల నేతలకు, పోలీసులకు మధ్య ఘర్షణ కూడా జరిగింది. 

 

జనగామ ఎమ్మెల్యే కాంప్ కార్యాలయం దగ్గర టీఆర్ఎస్ మహిళా నేత ఆత్మహత్య యత్నం చేశారు.  జనగామ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ 6 వార్డు కు చెందిన గంగాభవాని అనే టీఆర్ఎస్ మహిళా  కార్యకర్త పార్టీ కండువా తో ఉరేసుకునే ప్రయత్నం చేసింది.  కష్టపడ్డవారికి కాకుండా వేరే వాళ్లకు టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు.

 

వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ దగ్గర బీజేపీ నాయకులు ధర్నా చేశారు. పోలీసులకు, బీజేపీ  నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అభ్యర్థుల్ని డబ్బులతో కొనుక్కుంటున్నారని, ఎన్నికలు రద్దు చేయాలని కాషాయ నేతలు డిమాండ్ చేశారు. 

 

ఆదిలాబాద్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మనీషాకు కౌన్సిలర్ టికెట్ నిరాకరించింది టీఆర్ఎస్. నామినేషన్ విత్ డ్రా చేసుకుని కంటతడి పెట్టారు మనీషా. పండగ పూట ఆడబిడ్డతో కన్నీళ్లు పెట్టించారని, ఆడబిడ్డ ఉసురు తగులుతుందని ఆమె చెప్పారు. నమ్మినవాళ్లు వెన్నుపోటు పొడిచారని, సొంత కొడుకును ఛైర్మన్ చేయడానికే మంత్రి జోగు రామన్న తన రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని మనీషా ఆరోపించారు.

 

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశారు. 14వ వార్డులో టిఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన లోకొత్ విజయ్ కుమార్ కు బీఫామ్ దక్కలేదు. ఉద్యమకారుడ్ని అయినా.. తనకు పార్టీ బీఫామ్ దక్కలేదని అంబేత్కర్ విగ్రహం దగ్గర.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. విజయ్ కుమార్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: