జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనతో.. కాకినాడలో హై టెన్షన్‌ నెలకొంది. ఏక్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ ఏర్పడింది. పరిస్థితి.. వైసీపీ వర్సెస్‌ జనసేనగా మారడంతో.. నగరం రణరంగాన్ని తలపించింది. దీంతో పోలీసులు పటిష్ట భద్రతాఏర్పాట్లు చేశారు. 

 

ఆదివారం జరిగిన గొడవలో గాయపడిన జనసేన కార్యకర్తల్ని పరామార్శించేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌... కాకినాడకు రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితులు వైసీపీ వర్సెస్‌ జనసేనగా మారిపోవడంతో పోలీసులు అలర్టయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

విశాఖ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం అందుకున్న పవన్‌... భారీ కాన్వాయ్‌తో కాకినాడకు బయల్దేరారు. అయితే పోలీసులు కాన్వాయ్‌ లో కొన్ని వాహనాలను మాత్రమే అనుమతించారు. నగరంలోని గుడారిగుంట ప్రాంతంలో స్థానిక నేత పంతం నానాజీ ఇంటికి చేరుకున్న పవన్‌.. ఆదివారం దాడి ఘటనలో గాయపడిన జనసైనికులను పరామర్శించారు. దాడి జరిగిన తీరును , ఆ తర్వాత నెలకొన్న పరిణామాలను.. నేతలను అడిగి తెలుసుకున్నారు. 

 

పవన్‌ పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా కాకినాడలో పోలీసులు భారీగా మోహరించారు. నగరమంతా 144 సెక్షన్‌ను, పోలీస్‌యాక్ట్‌ 30ని అమలు చేశారుఉ.  ఎక్కడికక్కడ జనసైనికులను అడ్డుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాలకూ తోపులాట జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్‌ చేయాల్సి వచ్చింది.

 

మూడు రాజధానులకు అనుకూలంగా ఆదివారం ర్యాలీ నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి పవన్‌పై ఘాటు విమర్శలు చేశారు. దీంతో క్షమాపణ చెప్పాలంటూ జనసేన కార్యకర్తలు ద్వారంపూడి ఇంటి ముందు నిరసనకు దిగారు. దీంతో రెండువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తల దాడిలో పలువురు జనసేన కార్యకర్తలు గాయపడ్డారు.

 

పవన్‌ కల్యాణ్‌ కాకినాడ పర్యటన సందర్భంగా.. మరోసారి రెండు వర్గాలకూ గొడవ జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఆ మార్గాన్ని వెహికిల్‌ ఫ్రీ జోన్‌గా ప్రకటించి.. వాహనాలను అనుమతించలేదు. అయితే చెదుమొదురు ఘటనలు మినహా పవన్‌ పర్యటన ప్రశాంతంగా ముగియడంతో.. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: