రాజ‌కీయాలు ప‌క్క‌న‌పెట్టి...మంచిని మంచిగా..చెడును చెడుగా చూడ‌టంలో త‌ప్పేం లేదు. నాయ‌కుల నిర్ణ‌యాలు అంతిమంగా ఓట్ల కోస‌మే అనే అభిప్రాయాలు ఎలాగూ ఉన్న‌ప్ప‌టికీ...కొన్ని నిర్ణ‌యాలు మాత్రం ఎంతో హుందాగా ఉంటాయ‌ని, అవి ఎంద‌రో జీవితాల్లో మార్పులు తీసుకువ‌స్తాయ‌ని ప‌లు సంద‌ర్భాల్లో కొంద‌రు వ్యాఖ్యానిస్తుంటారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం ఇప్పుడు అలాగే అనేక‌మంది అన్న‌దాత‌ల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది.  నేలనే నమ్ముకొని ఆరుగాలం కష్టపడి కుటుంబాన్ని పోషించే ఇంటి పెద్ద అకాల మరణంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నం కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన రైతు బీమా ప‌థ‌కం గురించే ఈ ప్ర‌స్తావ‌న‌.


అన్న‌దాత ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఆ కుటుంబం రోడ్డున ప‌డొద్ద‌నే ఉద్దేశంతో.... 2018 ఆగస్టు 14న ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతు బీమా ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. రైతుబీమా పథకానికి 18-59 ఏళ్ల లోపు వయస్సు కల్గిన రైతులను అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరికి ప్రభుత్వమే బీమా ప్రీమియాన్ని చెల్లించింది. బీమా పథకం కింద నమోదైన రైతులు ఏదైనా కారణంతో మరణిస్తే వారి కుటుంబసభ్యులకు 10 రోజుల్లో రూ.5 లక్షలు పరిహారంగా ఎల్‌ఐసీ అందజేస్తున్నది. ఈ పథకం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో మరణించిన దాదాపు 22,583 మంది రైతుల కుటుంబాలకు బీమా సంస్థ రూ.1,129.15 కోట్లు పరిహారంగా చెల్లించింది.


రైతు బీమా పథకం ప్రారంభమైన తొలి ఏడాది 2018-19లో 31.86 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.2,271.50 చొప్పున ప్రభుత్వమే దాదాపు రూ.710.58 కోట్లు ప్రీమియంగా చెల్లించింది. తొలి ఏడాదిలో దాదాపు 17,399 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా.. వీరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున దాదాపు రూ. 869.95 కోట్లు బీమా కంపెనీ చెల్లించింది. 2019-20లో కూడా ఒక్కో రైతుకు రూ.3,457.40 చొప్పున ప్రీమియంగా దాదాపు 31.86 లక్షల మంది రైతులకు గ్రూప్‌గా రూ.1,071.79 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5,184 మంది రైతులు వివిధ కారణాలతో మరణించినట్టు వ్యవసాయాధికారులు గుర్తించారు. మరణించిన రైతుల కుటుంబాలకు దాదాపు రూ.259.20 కోట్లు చెల్లించినట్లు ఎల్‌ఐసీ అధికారులు వెల్లడించారు. రైతుబీమా పథకం కింద నమోదైన రైతుల్లో సుమారు 91 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కుటుంబాలు ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: