నిరుద్యోగుల‌కు చేదు వార్త‌. దేశంలోని ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను ప్ర‌తిబింబించే వార్త‌. మార్కెట్‌లో నెలకొన్న స్తబ్ధత, మందగించిన వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం ఆయా వ్యాపార, పారిశ్రామిక సంస్థల అమ్మకాలు, ఉత్పత్తికి విఘాతం కలిగిస్తున్నాయి. దీంతో వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్న సంస్థలు.. కొత్త ఉద్యోగాల జోలికి వెళ్లడం లేదు. ఉన్న ఉద్యోగులనూ తొలగిస్తున్నాయి. తక్కువ జీతాలకే పనికి కుదుర్చుకుంటున్నాయి. ఇలా అనేక ర‌కాలైన కార‌ణాలు...ఉపాధి కల్పన రంగాలను మందగమన పరిస్థితులు తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు ఎస్బీఐ రిసెర్చ్ తాజా నివేదిక తేటతెల్లం చేసింది. 

 

ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల గురించి ఎస్బీఐ రిసెర్చ్ రిపోర్టు-ఎకోరాప్ తాజాగా విడుద‌ల చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19)తో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) దాదాపు 16 లక్షల కొత్త ఉద్యోగాలు తగ్గవచ్చని చెప్పింది. 2018-19లో 89.7 లక్షల కొత్త కొలువులు పుట్టుకొచ్చాయని ఈపీఎఫ్‌వో గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది. అయితే 2019-20 ఏప్రిల్-అక్టోబర్‌లో 43.1 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది. ఈ లెక్కన మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో 73.9 లక్షల ఉద్యోగాలు రావచ్చని ఎస్బీఐ రిసెర్చ్ అంచనా వేసింది. దీంతో గతంతో పోల్చితే ఈసారి 15.8 లక్షల ఉద్యోగాలు తగ్గవచ్చని పేర్కొంది.

 

గడిచిన ఏడాది కాలంలో అస్సోం, రాజస్థాన్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ర్టాల్లో వలస కార్మికుల ఆదాయం పడిపోయిందని, వారి కుటుంబాలకు వారి నుంచి వెళ్తున్న సొమ్ము తగ్గిందని ఎస్బీఐ రిసెర్చ్ రిపోర్టు-ఎకోరాప్ తెలిపింది. . పేద, మధ్యతరగతి వర్గాల వారికి ఏండ్ల తరబడి వలసలే జీవనాధారంగా ఉంటుండగా, వ్యవసాయ ప్రధాన రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్ రాష్ర్టాల్లోని ప్రజలు.. పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ర్టాలకు వలసపోతున్నారు. ఢిల్లీకి ఎక్కువ మంది వలస వెళ్తున్నారని, ఉద్యోగావకాశాలు సమృద్ధిగా ఉండటమే ఇందుకు కారణమని తాజా నివేదిక తెలిపింది. వీరంతా ఇప్పుడు ఆర్థిక మందగమనంతో ప్రభావితులు అవుతున్నారని వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: