గడచిన మూడు నెలలుగా ఉల్లి ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో సామాన్యులు కొనేందుకు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. గడచిన కొన్ని రోజుల నుండి ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నా ఇప్పటికీ కిలో 40రూపాయల నుండి 60రూపాయల వరకు పలుకుతూ ఉండటంతో సామాన్యులకు ఉల్లి కష్టాలు తప్పటం లేదు. ఇలాంటి సమయంలో ఢిల్లీలోని ఉల్లి వినియోగదారుల కోసం కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఢిల్లీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఢిల్లీలో ధరలు ఇప్పటికీ అదుపులోకి రాకపోవడంతో ధరలను అదుపులోకి తీసుకొనిరావటానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం ఢిల్లీలోని వినియోగదారుల కోసం 22 రూపాయలకే కిలో ఉల్లిని అందించనున్నట్టు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఢిల్లీ ప్రజలు కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరలు అదుపులోకి రాకపోతే మిగతా రాష్ట్రాలలో కూడా కేంద్రం కిలో ఉల్లిని 22 రూపాయలకే అందించే అవకాశం ఉంది. 
 
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే ఉల్లి ధర గతంతో పోలిస్తే దిగి వచ్చింది. తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు వినియోగదారులకు సబ్సీడీ ధరలకు ఉల్లిని అందిస్తున్నాయి. కొత్త సంవత్సరంలో ఉల్లి ధరలు తగ్గుతూ ఉండటంతో వినియోగదారులకు ఊరట కలుగుతోంది. మరోవైపు మార్కెట్లోకి కొత్త పంట అందుబాటులోకి వస్తూ ఉండటంతో ఉల్లి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నెల చివరకు కిలో ఉల్లి 20 రూపాయలకు లభించే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 
 
కొన్ని రోజుల క్రితం సబ్సిడీ ధరకు కేజీ ఉల్లిపాయలు దొరికినా చాలు అనుకున్న ప్రజలు ఉల్లి ధరలు కొద్దికొద్దిగా తగ్గుతూ ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మహారాష్ట్ర రాష్ట్రం నుండి భారీగా ఉల్లి దిగుమతి అవుతూ ఉండటంతో ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రం కూడా రాష్ట్రాల డిమాండ్ ను బట్టి ఉల్లిని సరఫరా చేస్తోంది. హోల్ సేల్ మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గడంతో రిటైల్ మార్కెట్లో కూడా ఉల్లి ధరలు తగ్గుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: