ఏపీ సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీలను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. సీఎం వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికి వేడుకలను ప్రారంభించారు.

 

సీఎంకు పూర్ణ కుంభంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. చిన్నారులకు భోగి పళ్లు పోసి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశీర్వదించారు. అక్కడ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులను సీఎం తిలకించారు. కోలాటం ఆడుతున్న చిన్నారులను వైయస్‌ జగన్‌ మెచ్చుకున్నారు. ఒంగోలు గిత్తలను పరిశీలించారు. అనంతరం గంగిరెద్దుల ప్రదర్శనను తిలకించారు.

 

కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆద్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. సంప్రదాయబద్దంగా ఏర్పాటు చేసిన వివిద కళారూపాలను తిలకిస్తూ, ఎడ్ల బండలాగుడు పందాల వద్దకు ముఖ్యమంత్రి వెళ్లారు. అయితే ఇక్కడో విశేషం ఉంది. జగన్ కు చర్నా కోలా ఇచ్చి ఎడ్లను ఝళిపించాలని కొడాలి నాని కోరారు. అయితే ముఖ్యమంత్రి నవ్వుతూ అబ్బో వద్దు అంటూ ఆయన వేదికపైకి వెళ్లిపోయారు.

 

ఆ తర్వాత కొంతసేపు ఆయన వేదికపై కూర్చుని ఎడ్ల పందాలను తిలకించారు. ఈ వేడుకల్లో కోడి పుంజులను ఏర్పాటు చేయలేదు. జగన్ గంగిరెడ్ల నృత్యాన్ని, కోలాటం ప్రదర్శనను ఆయన తిలకించారు. ఇంకో విచిత్రం ఏంటంటే.. ఎన్.టి.ఆర్ టు వైఎస్ ఆర్ ట్రస్ట్ పేరుతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కొడాలి నాని అన్నారు.

 

సీఎం జగన్‌ గుడివాడ సంక్రాంతి వేడుకలకు రావడం ఆనందంగా ఉందన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్షాలు సమృద్ధిగా కురిసి.. పంటలు బాగా పండాయని మంత్రి కొడాలి నాని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: