అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దాదాపు పాతిక రోజుల నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం రాజధాని మార్చాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే రాజధాని రైతులను బుజ్జగించేందుకు తగిన యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

 

మరోవైపు చంద్రబాబు ఈ రాజధాని రైతుల ఇష్యూను రాజకీయం చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. చివరకు సంక్రాంతి పండుగను సైతం ఆయన ఉద్యమంగా మలుస్తున్నారు. అందుకే చంద్రబాబు రాజకీయానికి చెక్ పెట్టేలా జగన్ వ్యూహం రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని మార్పు తప్పదు.. కానీ మీకు న్యాయం చేస్తాం అని రైతులు భావించేలా కసరత్తు చేస్తున్నారట.

 

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం మరింత ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం ప్రభుత్వానికి లాండ్ పూలింగ్ కింద ఇచ్చిన భూములకు అదనంగా మరో 200 గజాల స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాకుండా రైతులకు మరో మూడు సంవత్సరాలు అదనంగా కౌలు చెల్లించాలని కూడా జగన్ భావిస్తున్నారట.

 

చంద్రబాబు ప్రభుత్వం రాజధాని రైతులకు అత్యధికంగా 1400 గజాల స్థలాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంది. కాని జగన్ ప్రభుత్వం దానిని 1600 గజాలకు పెంచాలని ఆలోచిస్తోందట. అలాగే పదేళ్లపాటు ఈ భూములకు కౌలు ఇవ్వవలసి ఉంది. దాన్ని కూడా మరో మూడేళ్లు పెంచుతారట. అంటే.. పదమూడేళ్ల వరకూ కౌలు ఇస్తారన్నమాట. అంతేకాక కాజ నుంచి రాజధాని ప్రాంత గ్రామాల మీదుగా నున్న , గుండుగొలనులకు నాలుగు లైన్ ల రహదారి కూడా నిర్మించేందుకు ఓకే చెపుతారట.

 

ఇలా.. మొత్తానికి రాజధాని రైతులను బుజ్జగించడం ద్వారా విశాఖను రాజధాని చేసేందుకు రూట్ క్లియర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్లాన్ ఓకే అయితే రైతులు కూడా ఆందోళనలను విరమించే అవకాశం ఉంది. రాజధాని మార్పు ఎలాగూ తప్పదని వారు కూడా మానసికంగా రెడీ అయినట్టే కనిపిస్తోంది. ఇక మిగిలింది మంచి ప్యాకేజీ మాట్లాడటమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: