మా ప్రియమైన పాఠకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.. ఈరోజు మా కార్యాలయానికి సెలవు. అందువల్ల రేపటి సంచిక వెలువడదు. మళ్లీ ఎల్లుండి పునర్దర్శనం.. ఇలాంటి ప్రకటనలో సంక్రాంతి రోజు అన్ని తెలుగు దిన పత్రికల్లోనూ తప్పనిసరిగా కనిపిస్తాయి. సంక్రాంతికి సెలవు ఉన్నందువల్ల దిన పత్రికకు సంబంధించి ఎవరూ పనిచేయకపోవడం వల్ల దిన పత్రిక వెలువడదు అన్నది ఈ ప్రకటన సారాంశం.

 

అయితే ఈ నిబంధన ఇంకా ఈ కాలంలోనూ అమలవుతుండటం విచిత్రం. ఎందుకంటే. పండగ ఉందని రైళ్లు ఆగవు. బస్సులు ఆగవు.. అంతెందుకు మీడియా రంగంలోనే అనేక విభాగాలు నిరంతం పని చేస్తూనే ఉంటాయి. టీవీ ఛానళ్లు ప్రత్యేక ప్రోగ్రాములు ఇస్తూనే ఉంటాయి. ఇక 24 గంటల న్యూస్ ఛానళ్లు ప్రసారాలకూ బంద్ ఉండదు. కొత్త తరం మీడియా డిజిటల్ కూడా పని చేస్తూనే ఉంటుంది.

 

మరి ఇవన్నీ పని చేస్తూనే ఉంటుంటే.. కేవలం పత్రిక మాత్రమే ఎందుకు ఆగిపోతోంది.. ఒక వేళ పాత సంప్రదాయం ప్రకారం అప్పట్లో పత్రిక రాకపోయినా.. ఈ తరంలోనూ ఈ ఆనవాయితీ కొనసాగించాలా.. ఎందుకంటే.. ఇప్పటికే డిజిటల్ మీడియా దెబ్బకు ప్రింట్ మీడియా కుదేలవుతోంది. మరోవైపు పెరిగిన ఖర్చులతో సతమతం అవుతోంది.

 

ఇప్పటికే స్పాట్ వార్తల కోసం దిన పత్రికలపై ఆధారపడటం బాగా తగ్గిపోయింది. న్యూస్ వెబ్ సైట్లు, టీవీలు, యూట్యూబ్ రాకతో ఎప్పటికప్పుడు వార్తలు క్షణాలపై పాఠకులను చేరుతున్నాయి. దిన పత్రిక వస్తేనే వార్తలు వచ్చే రోజులు పోయాయి. ఇలాంటి సమయంలో నిరంతరం పత్రికలు పాఠకుల మనసు చూరగొనడమే వాటి మనుగడకు క్షేమదాయకం.

 

అంతగా అవసరమనుకుంటే.. ఆ ఒక్క రోజు కోసం ప్రత్యేక ఎండిషన్లు ముందే సిద్ధం చేసుకుని కొందరు సిబ్బందిని అత్యవరంగా అందుబాటులో ఉంచితే.. పండుగ రోజు కూడా దిన పత్రిక ఎడిషన్ అందుబాటులో ఉంచొచ్చు. మరి దిన పత్రికలు ఈ దిశగా ఆలోచిస్తాయా.. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: