ఈ నెల 20 నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి . ప్రధానంగా మూడు రాజధానుల ఏర్పాటు అంశం పైనే చర్చ జరగనుంది .  ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటుకు  సూత్రప్రాయంగా ఒకే చెప్పిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ , కేబినెట్ భేటీ లో ఆమోదించి అనంతరం అసెంబ్లీ లో చర్చకు పెట్టనుంది .  గతనెల 17 వతేదీన శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజున మూడు రాష్ట్రాల ఏర్పాటు ప్రతిపాదన గురించి  జగన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే .

 

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు నిపుణుల కమిటీ , బోస్టన్ నివేదికలు మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని సూచించడం తో, రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి , ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసి దాదాపుగా మూడు రాజధానుల ఏర్పాటుకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . అయితే    మూడు రాజధానుల ప్రతిపాదనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి . ప్రభుత్వ తీరును ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ , జనసేనాని పవన్ కళ్యాణ్ ఇలా ఒక్కరేమిటి అందరూ జగన్ సర్కార్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు .

 

విపక్ష నేతలు చేస్తోన్న విమర్శలపై  ఇప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించిన దాఖలాలు లేవు . విశాఖ ఉత్సవాల్లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి , మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించి , విపక్షాల తీరు ను ఎండగడుతారని అందరూ భావించారు . కానీ జగన్మోహన్ రెడ్డి , విపక్షాల ఊసే ఎత్తలేదు . ఇక ఇటీవల ఆరోగ్య శ్రీ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలోను  , గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుతున్నామని చెప్పి , విపక్షాల విమర్శలపై పల్లెత్తు మాట కూడా అనలేదు . జగన్ మౌనం చూస్తుంటే తుఫాన్ ముందు ప్రశాంతత మాదిరిగా ఉందని , అసెంబ్లీలో విపక్షాలను ఆయన కడిగేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: