జనసేన తరుపున గెల్చిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇక ఆ పార్టీ తో తెగతెంపులు చేసుకున్నట్టేనా ?, జనసేనాని సైతం ఆయన మీద ఆశలు వదిలేసుకున్నారా ?? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం విన్పిస్తోంది .   జనసైనికులపై ఇటీవల  కాకినాడ లో అధికార పార్టీ నేతలు దాడి చేశారు . ఆ సమయం లో పవన్ కళ్యాణ్ హస్తిన లో ఉన్నారు . పార్టీ తరుపున గెల్చిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కనీసం జనసైనికులను పరామర్శించే ప్రయత్నం చేయలేదు .

 

ఢిల్లీ లో బీజేపీ అగ్రనేతలతో సమావేశమైన పవన్ నేరుగా విశాఖ చేరుకొని అక్కడి నుంచి కాకినాడ కు చేరుకున్నారు . పార్టీ అధినేత పవన్ వస్తున్నారని తెలిసి కూడా రాపాక మరోమారు ముఖం చాటేశారు . ఇటీవల పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడమే కాకుండా , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని స్వాగతించడం ద్వారా తాను వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు . ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యం ప్రవేశపెట్టడాన్ని పవన్ తీవ్రంగా వ్యతిరేకించారు . అయితే అసెంబ్లీ వేదికగా రాపాక, ప్రభుత్వ నిర్ణయించి  సమర్ధించి పవన్ కు ఝలక్ ఇచ్చారు . ఇక తాజాగా మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనకు  వ్యతిరేకంగా జనసేనాని బలంగా గళాన్ని వినిపిస్తున్నారు .

 

రాజధాని ప్రాంత రైతుల్ని కూడా కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు . పార్టీ అధినేత పవన్ , రాజధాని ప్రాంత రైతుల్ని కలిసేటప్పుడు ఆయన వెంట లేని రాపాక , మూడు రాజధానుల వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని స్టేట్ మెంట్ ఇచ్చి తన మనోగతం ఏమిటో చెప్పకనే చెప్పేశారు .   కాకినాడ కార్యక్రమానికి  రాపాక డుమ్మా కొట్టడం  గురించి  జనసేనాని ని మీడియా ప్రతినిధులు  ప్రశ్నిస్తే ... ఆయనకు ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాయోనని పేర్కొంటూ , తాము కూడా రాపాక పై  నీళ్లు వదిలేసుకున్నామని పవన్  పరోక్షంగా చెప్పేశారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: