హస్తిన పోరులో ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పీడ్ పెంచింది. బీజేపీ, కాంగ్రెస్‌ లాంటి ప్రధాన ప్రతిపక్షాల కంటే ముందే తమ అభ్యర్ధులను ప్రకటించింది. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం కేజ్రీవాల్‌. అన్ని స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేస్తామంటూ ప్రత్యర్ధులకు సవాల్‌ విసురుతోంది ఆప్‌.  

 

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీ దూకుడు పెంచింది. నామినేషన్ లు ప్రారంభమైన తొలి రోజే.. ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో అభ్యర్థులను ఖరారు చేసి ప్రత్యర్థులకు షాక్‌ ఇచ్చారు. సిట్టింగ్‌ల్లో 15 మందికి టికెట్‌ ఇచ్చేందుకు కేజ్రీవాల్‌ నిరాకరించారు. 46 స్థానాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకే టికెట్లు దక్కాయి. 

 

సీఎం కేజ్రీవాల్‌ న్యూఢిలీ​అసెంబ్లీ స్థానం నుంచి, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా పట్పర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఐదు మంది మహిళలకు అవకాశం కల్పించగా ఈ సారి ఎనిమిది మందికి సీట్లు కేటాయించింది. టిక్కెట్లు పొందిన అభ్యర్ధులకు సీఎం కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఆప్‌పై విశ్వాసం ఉందన్నారు కేజ్రీవాల్‌.

 

ఓటర్లను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ వినూత్న విధానంలో ప్రచారానికి తెరలేపింది. వీడియో గేమ్‌ను రూపొందించి సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. పాపులర్‌ వీడియో గేమ్ మారియోలో కేజ్రీవాల్‌ మారియో పాత్ర పోషించారు. గత ఐదేళ్లలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ వీడియోను రూపొందించారు. మొహల్లా క్లినిక్స్, విద్యా రంగం మెరుగుదల, ఆరోగ్య సదుపాయాలు, సీసీటీవీల ఏర్పాటు, మహిళల భద్రత కోసం వీధి దీపాల ఏర్పాటు, ఉచిత వైఫై సదుపాయం వంటివాటిని ఆయన వివరించారు.

 

ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి. కోటీ నలభై ఆరు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దేశ రాజధానిలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: