మున్సిపల్ ఎన్నికల్లో అంతా లోకల్ కే పరిమితం అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రం అంతటా పర్యటిస్తామని చెప్పిన నాయకులు కూడా... ఫస్ట్ లోకల్... నెక్స్ట్ స్టేట్ అని డిసైడ్ అయ్యారు.


మున్సిపల్ ఎన్నికలకు ముందు..పార్టీలో ముఖ్య నాయకులంతా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తామని అర్భాటంగా ప్రకటించారు. ప్రభుత్వాన్ని జనంలో దోషిగా చూపిస్తామని మాటలు చెప్పారు. తీరా ఎన్నికలు దగ్గర పడగానే...ఎక్కడి వాళ్ళు అక్కడ గప్ చుప్ అన్నట్టు... సొంత నియోజక వర్గానికే పరిమితం అయ్యారు. కనీసం పార్టీ ప్రకటించినట్టు... సీనియర్ నాయకులైనా ప్రచారానికి వెళ్తారా.. అనేది చూడాలి. 

 

పార్టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎన్నికల నామినేషన్ ఘట్టం ప్రారంభం అయినప్పటి నుండి... హుజుర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గంలో ఉన్న మున్సిపాలిటీ ఎన్నికల సమీక్షలు... సర్దుబాట్లలోనే ఎక్కువ నిమగ్నం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ తో మాట్లాడారు. ఎన్నికల ప్రచారాన్ని మాత్రం ఇప్పటి వరకు చేయలేకపోయారు. 

 

ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా... తన భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గంలోనే చక్కబెడుతున్నారు. తన పరిధిలో ఉన్న మున్సిపల్స్ వరకే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా తన పరిధిలోనే కావడంతో అన్నతమ్ముళ్ళు...ఇద్దరూ సొంత నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. మరో ఎంపీ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కార్పొరేషన్ లలోనే ప్రచారం చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకులకు కొంత టఫ్ ఫైట్ ఇస్తున్నారన్న చర్చ మాత్రం ఉంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన మధిర నియోజక వర్గంలో బిజీగా ఉన్నారు. తన నియోజకవర్గంలో అధికార పార్టీ ఒత్తిళ్ళు.. పార్టీ 
అభ్యర్థులపై వేధింపుల కారణంగా లోకల్ కే పరిమితం కావాల్సి వచ్చిందని భట్టి టీం చెబుతోంది. 

 

ఇక మాజీ మంత్రి శ్రీధర్ బాబు.. దామోదర రాజనర్సింహ లాంటి వాళ్ళు కూడా తమ ప్రాంతాలపైనే ఫోకస్ పెట్టారు.ఎన్నికల తేదీ కూడా దగ్గర పడుతోంది.  పార్టీ మాత్రం... సీనియర్ నాయకులు రాష్ట్రం అంతా పర్యటించి ప్రచారం చేస్తారు అని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రమంతా తిరిగే స్టార్ క్యాంపైనర్ లు ఎవరన్నది కూడా ఫిక్స్ అయినట్టు లేదు. 

 

మున్సిపల్ ఎన్నికలకే కాదు..సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది.  రాష్ట్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటేనే పార్టీకి మేలు జరుగుతుందని సెకండ్ కేడర్ లీడర్లు మొత్తుకుంటున్నారు. పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియక తమలో తామే మధనపడుతున్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: