దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆందోళనకారులు. సినీ రాజకీయ ప్రముఖులు సైతం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినదీస్తున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పౌరసత్వ సవరణ వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకు వచ్చినప్పుటి  నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అంతేకాకుండా గతంలో జరిగిన పుల్వామా దాడిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ. 

 

 

 కాగా తాజాగా పౌరసత్వ సవరణ బిల్లు పై అసొం లో  జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్  కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పుల్వమ పార్లమెంట్ దాడులపై పునర్విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు రామ్ మాధవ్. ఇది సిగ్గుచేటైన విషయం అంటూ విమర్శించారు. పాకిస్తాన్ కు క్లీన్ చిట్ ఇచ్చేంతగా  కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మీ పనితనాన్ని వారి త్యాగాలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది అంటూ దుయ్యబట్టారు రామ్ మాధవ్. 

 

 

 పౌరసత్వ సవరణ చట్టం పై దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో  కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగడుతూన్నామని  స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై అపోహలను అవాస్తవాలను కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తూ ప్రజల్లో  ఈ చట్టం పై చెడు అభిప్రాయం వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎలాంటి అంశాలు దొరక్కపోవడంతో..  పౌరసత్వ  సవరణ చట్టం పై ప్రతిపక్షాలన్నీ దుష్ప్రచారానికి ఉసిగొల్పుతోన్నాయని  ఆరోపించారు. వాటిని తిప్పి కొట్టి మోడీ కి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాంమాధవ్ పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: