ఓ వైపు సంక్రాంతి పండుగ, మ‌రోవైపు మున్సిపల్‌ ఎన్నికలు...తెలంగాణ‌లో సంద‌డే సంద‌డి. ఇలాంటి సంద‌ర్భంలో...టీఆర్‌ఎస్‌ పార్టీ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. పార్టీకి చెందిన కారు గుర్తుపై మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రెండెకరాల స్థలంలో భారీ కారుగుర్తు ముగ్గును వేశా రు. మూడు గంటల వ్యవధిలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా విభాగానికి చెందిన 200 మంది కార్యకర్తలు గులాబీ రంగు కారును నేలపై తీర్చిదిద్దారు. ఈ పిక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ముగ్గువేసిన మహిళలకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

 

సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల- వేములవాడ బైపాస్‌ రోడ్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా విభాగానికి చెందిన 200 మంది కార్యకర్తలు నేలపై తీర్చిదిద్దిన‌ కారు ముగ్గు ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముగ్గును చూసేందుకు వాహనదారులు, స్థానిక ప్రజలు బైపాస్‌రోడ్డుకు తరలివచ్చారు. దీంతో ఇక్క‌డ భారీ సంద‌డి క‌నిపించింది.

 


కాగా, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏకగ్రీవాల్లో కారు దూసుకుపోయింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తికావడంతో అధికారులు అభ్యర్థుల తుదిజాబితాలను విడుదలచేశారు. ఈ జాబితాల ప్రకారం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతుండగా.. 40 మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లలో 81 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వాటిలో 78 వార్డులను టీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా కైవసం చేసుకున్నది. నిర్మల్‌ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీలో ముగ్గురు ఎంఐఎం అభ్యర్థులు పోటీలేకుండా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 38 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఉన్నారు. వరంగల్‌ జిల్లా పరకాల మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠం కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరింది. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉండగా మంగళవారం నాటికి 11 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మంగళవారం ఒక్కరోజే ఐదు వార్డులు పోటీ లేకుండా టీఆర్‌ఎస్‌ పరమయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: