తెలంగాణ‌లో జ‌రుగుతున్న కీల‌క‌మైన పుర‌పాల‌న ఎన్నిక‌ల్లో...పోలింగ్ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఈ నెల 22న, కరీంనగర్‌ కార్పొరేషన్‌కు 24న పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.తుది అభ్యర్థుల జాబితా ఖరారైంది. దాదాపు 12,398 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వీరిలో దాదాపుగా 2,970 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌ పక్షాన 2603, బీజేపీ నుంచి 2330 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. జాబితా విడుదలతోపాటు గుర్తులు కూడా ఖరారు కావడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 20న ప్రచారం ముగించాల్సి ఉండటంతో అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్క ఓటరును కలిసి ప్రచారంచేస్తున్నారు. 20న సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తుంది.

 

పురపాలక ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను ఖరారుచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. పది కార్పొరేషన్లలో 385 వార్డుల్లో 1786 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. నిజామాబాద్‌లో అత్యధికంగా 411, కరీంనగర్‌లో 348, రామగుండంలో 242 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. తక్కువగా బండ్లగూడ జాగీర్‌లో 85 కేంద్రాలున్నాయి. 120 మున్సిపాలిటీల్లో 2,727 వార్డులకు 6,325 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మున్సిపాలిటీల్లో అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 240, ఆదిలాబాద్‌లో 183, నల్లగొండలో 180, సూర్యాపేటలో 146, మిర్యాలగూడలో 144 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. డోర్నకల్‌, వర్ధన్నపేట, కొత్తపల్లి, ధర్మపురి మున్సిపాలిటీల్లో 15 చొప్పున పోలింగ్‌ కేంద్రాలున్నాయి.

 


మ‌రోవైపు తుది అభ్యర్థుల జాబితా ఖరారవ‌డం,  గుర్తుల కేటాయింపు పూర్తవ‌డంతో బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. మున్సిపల్‌ ఎన్నికలకు తెలుపురంగులో బ్యాలెట్‌ పేపర్‌ను ముద్రించాలని  నిర్ణయించింది. అధికారులు అత్యవసర ఆదేశాలు జారీచేశారు. ఒక్కో బ్యాలెట్‌ పత్రంలో మొత్తం నోటాతో కలిపి ఎనిమిది గుర్తులు కేటాయించనున్నారు. ఒక వార్డులో ఏడుగురికంటే ఎక్కువమంది పోటీచేసినట్లయితే రెండో బ్యాలెట్‌ పత్రాన్ని ముద్రిస్తారు. బ్యాలెట్‌ పత్రాల ముద్రణలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్వోలను ఎన్నికల సంఘం ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: