ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాత మిత్రులు కాస్తా మళ్లీ కొత్తగా ఏకమవుతున్నారు. గతం అంతా మరిచిపోయి మరీ జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నారు. బెజవాడలో ఈ రోజు జరిగే సమావేశం బీజేపీ... జనసేనకు కీలకం కానుంది. అసలు...ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉందనేది ఆసక్తికరంగా మారింది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ రోజు జనసేన, బీజేపీ నేతలు విజయవాడలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ రెండు పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఒక అవగాహనకు వచ్చాయి. ఇప్పుడు ఇదే ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా రాజధాని ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. 29 గ్రామాలకే పరిమితమైందనుకున్న ఉద్యమం.. తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా ఊపందుకుంది. 

 

ఇక... ఇటీవలే పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో టచ్‌లోకి వచ్చారు. ఈ మధ్య కాలంలో ఆయన బీజేపీ పెద్దల్ని కలిసేందుకు రెండు సార్లు ఢిల్లీకి వెళ్లారు. మొదటి సారిగా ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్... అక్కడ ఎవరిని కలిశారు? ఏం జరిగిందన్న విషయాలు బయటకు రాకుండా గోప్యంగానే ఉంచారు. ఇక తాజాగా ఢిల్లీ బాట పట్టిన పవన్ అక్కడ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. దీంతో జనసేన, బీజేపీ మధ్య స్నేహబంధం ఏర్పడిందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇకపై పవన్.. కాషాయంతో కలిసి నడుస్తారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ, జనసేన బెజవాడ సమావేశంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ  సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై ఓ అవగాహన కుదిరే అవకాశముంది. 

 

సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాది కాకముందే కొత్త కూటమికి బీజాలు పడ్డాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన బీజేపీ-జనసేన తిరిగి జట్టు కట్టడానికి రెడీ అవుతున్నాయి. 2014 ఎన్నికల్లో పోటీ చేయకున్నా.. బీజేపీ-టీడీపీకి మద్దతు ఇచ్చారు జనసేనాని. ప్రత్యేక హోదా కారణంగా 2019 ఎన్నికల్లో బీజేపీని కాదని అటు టీడీపీ.. ఇటు జనసేన ఒంటరిగానే పోటీ చేశాయి. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కొత్త పొత్తుల అవశ్యకత ఉందని బీజేపీ.. జనసేన గుర్తించాయి. 

 

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజాసమస్యలపై పోరాటం, భవిష్యత్‌ కార్యాచరణను ఏ విధంగా రూపొందించుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో ఓ అభిప్రాయానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.  ముఖ్యంగా రాజధాని తరలింపు విషయంలో ఈ సమావేశంలో అగ్ర నేతలు ఫోకస్‌ పెట్టే అవకాశం ఉంది. రాజధాని తరలింపుపై ఈ నెల 20న ప్రకటన కూడా రానుంది. ఇప్పటికే రాజధాని తరలింపు వ్యతిరేక ఉద్యమంలో యాక్టీవ్ రోల్‌ పోషించారు పవన్ కళ్యాణ్. రెండు పార్టీలు కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తే... రాజధాని తరలింపు విషయంలో ఏమైనా అద్భుతాలు జరగకపోవా..? అనే ఆశ ఉద్యమకారుల్లో కనిపిస్తోంది. 

 

ఇక...స్థానిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలి..? కలిసి పోటీ చేసే విషయంలో సీట్ల పంపకాలు ఏ విధంగా జరుపుకోవాలనే అంశంపై ప్రాథమికంగా చర్చ జరగనుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలు సహా స్థానిక, మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసే దిశగా సూత్రప్రాయ అంగీకారానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే టైమ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ విషయంలో ఎలాంటి వైఖరి ఉండాలనే అంశంపైనా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. పవన్ బీజేపీతోనే కాకుండా... టీడీపీతోనూ సన్నిహితంగా మెలుగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: