జగన్మోహన్‌రెడ్డి జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చారని, ఇది చాలా హేయమైన చర్య అని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అవినీతి, అక్రమాలు, జూదాలకు నిలయంగా మార్చారన్నారు.  రాష్ట్ర రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు నిరసన దీక్షలు చేస్తుంటే వారిని లాఠీలతో కొట్టించడమేకాక, బూటు కాళ్లతో తన్నించడం, అక్రమ అరెస్టులు చేయించడం, పిల్లలని కూడా చూడకుండా వ్యానుల్లో ఎత్తి పడేసిన సంఘటనలు చూస్తుంటే బాధాకరమన్నారు. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. వైసీపీ నాయకులే స్వయంగా  కోడిపందేలు, పేకాట నిర్వహించి కోట్ల రూపాయలు బెట్టింగులు కాయించారన్నారు. ఇందులో కమిషన్లు దండుకున్నారన్నారు. 

 
 
 
వీరికి పోలీసులు కాపలాగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. పోలీసు వ్యవస్థ మొత్తం జగన్మోహన్‌రెడ్డికి, విజయసాయిరెడ్డికి రిమోట్‌ కంట్రోల్‌లా మారిపోయిందన్నారు కోడిపందేలు, పేకాటను నిరోధించాల్సిన పోలీసులే వారికి రక్షణ ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మద్యం షాపులను తగ్గిచ్చేస్తాం, పేకాట లాంటివి అరికడతామని చెప్పి అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. గూండాయిజానికి తెరలేపారన్నారు. 8 మంది తెలుగుదేశం కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని దుయ్యబట్టారు. వీరి హయాంలో క్రికెట్టు బెట్టింగులు అధికమయ్యాయని ఎద్దేవ చేశారు. కోడిపందేలు నిర్వహించడానికి లైసెన్సు దక్కాలంటే వైసీపీ ఎమ్మెల్యేగాని, మంత్రిగాని అయివుండాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారన్నారు. 
 
 
 
పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ వ్యవహారం నడుస్తోందన్నారు. సామాన్యులు సరదాగా ఇళ్ల వద్ద కోడిపందేలు నిర్వహించుకుంటే ఆ సామాన్యులను, కోళ్లను తీసుకెళ్లి జైళ్లల్లో వేస్తున్నారన్నారు. ధరలను అదుపుచేయాల్సిన ప్రభుత్వం ప్రజల జేబులకు చిల్లులు పెడుతోందరు. అప్పులు చేసి లక్షలాది రూపాయలు జూదాల్లో తగలేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రోత్సహించడంతో వందల కోట్లు ఈ జూదంలో పోగొట్టుకున్నారన్నారు. రాజధాని రైతులు 30 రోజులుగా దీక్షలు చేస్తూ పండగ పూట కూడా  పస్తులతో గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 29 గ్రామాల రైతులు పస్తులండగా ఈ తుగ్లక్‌ ముఖ్యమంత్రేమో యడ్లపందేలకు వెళ్లి చిరునవ్వుతో యడ్లపందేలు చూడడం హాస్యాస్పదమన్నారు. పస్తులున్నవారిని పట్టించుకుంటే మేము కూడా సంతోషిస్తామన్నారు. ప్రజల కోసం, పార్టీ కోసం, మా నాయకుడి కోసం జైలుకెళ్లడానికైనా తాము సిద్దంగా ఉన్నామన్నారు. 
 
 
 
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోడిపందేలకు, యడ్లపందేలకు వెళ్లేవారు కాదని గుర్తు చేశారు. ప్రస్తుతం వైసీపీ నాయకులు జీవహింసను ప్రోత్సహిస్తున్నారన్నారు.రాజధాని విషయం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది.  అమరావతి విషయంలో మూడుముక్కలాట ఆడుతున్నారన్నారు.  ఇకనైనా వైసీపీ నాయకులు కళ్లు తెరవాల్సిందిగా సూచించారు. పస్తులున్న  రైతుల వద్దకు వెళ్లి పలకరించాలని తెలిపారు. రాజధాని రైతులవద్దకెళ్లి సమస్యలు కనుక్కోవాలని సూచించారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: