దేశ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే శాఖ ఆర్థికశాఖ. ఆర్థికశాఖ బాగా పనిచేస్తేనే దేశం అభివృద్ధి బాటలో ముందుకు వెళుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నా, కుదేలైనా ఆ బాధ్యత ఆర్థికశాఖదే అవుతుంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ పరిస్థితిల్లో ఉంది. ఇప్పటి వరకు యశ్వంత్ సిన్హా దేశానికి ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నవారిలో బెస్ట్‌గా ఉన్నారు. యశ్వంత్ సిన్హా ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నసమయంలో తాను ఎలాంటి ప్రతిపాదనలు చేసినా అందుకు అప్పటి ప్రధాని వాజ్‌పేయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. ఇదిలా ఉండగా కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు జరగనున్నాయా..? బడ్జెట్ సమావేశాల తర్వాత ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..? అంటే అవుననే చెబుతున్నాయి ఢిల్లీ వర్గాలు. అయితే కేబినెట్‌లో ఓ కీలక పదవికి స్థానచలనం తప్పదనే వార్తలు వస్తున్నాయి.. ఇంతకీ ఎవరిపై వేటు పడే అవకాశం ఉంది..? వారి స్థానంలో ఎవరికీ ఆ కీలక పదవి దక్కే అవకాశం ఉంది.


ఆర్థిక శాఖ మంత్రి మార్పు.. 
ఆర్థిక శాఖ మంత్రి మారతారనే వార్త హల్చల్ చేస్తోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఒక వేళ మారతే ఆ పదవిని ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ కేవీ కామత్‌కు ఇస్తారనే వార్త ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కామత్‌ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్త ప్రచారంలో ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కూడా రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చే అప్పట్లో ఆర్థికశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఇదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేసే యోచనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత ప్రభుత్వం ముందు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అతిపెద్ద సవాళ్లుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే నిర్మలా సీతారామన్‌ను ఆర్థికశాఖ మంత్రిగా తప్పించి కేవీ కామత్‌కు ఆ పదవి కట్టబెడితే కచ్చితంగా దేశానికి ఒక మంచి ఆర్థికశాఖ మంత్రి దొరికినట్లవుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మోడీ గ్రీన్ సిగ్నల్..
జీడీపీ, ఐఐపీలాంటి సూచికలు పడిపోయినప్పుడల్లా తెరపైకి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి ఆ పరిస్థితులకు దారితీసిన అంశాలను వివరిస్తారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థపై ఇటు విపక్షాలు అటు ఆర్థిక నిపుణులు విమర్శలు సంధిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ఫిక్స్ చేసేందుకు పలువురు ఆర్థిక నిపుణులతో సమావేశం అవుతున్నారట.ప్రధాని పలువురు ఆర్థిక నిపుణులతో భేటీ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఓ కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. అంతకుముందు పీవీ నరసింహారావు క్యాబినెట్‌లో మన్మోహన్ సింగ్ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. వాస్తవానికి పీవీ నరసింహారావు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఇది సాధ్యమైంది. అయితే ప్రధానిగా మాత్రం ఆర్థిక సంస్కరణలు తీసుకురాలేకపోయారు మన్మోహన్ సింగ్. ఇందుకు కారణం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అడ్డుపడేవారని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

తిరిగి గాడిలో పెట్టాలంటే..

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఏమీ బాగోలేదు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే ప్రభుత్వం కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులకు సంబంధించిన ఎన్‌పీఏలపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీలను కూడా డీల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక శాఖ మంత్రిగా కామత్ ఈ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది అనుమానమే. ఈ సలహాను గతంలోనే తాను ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి చెప్పినట్లు అరవింద్ సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. అయితే నష్టాల ఊబిలో కూరుకుపోయిన బ్యాంకులను నిలబెట్టాలంటే బాండ్ ద్వారానే ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని ఖర్చులను, సబ్సీడీలపై కోత విధించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: