దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నిర్భయ దోషులను ఉరితీసేందుకు తీహార్‌ జైల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఉరి ట్రయల్స్‌ కూడా నిర్వహిస్తున్నారు జైలు అధికారులు. దోషులను సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచారు. నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. మీరట్‌ నుంచి పవన్‌ జల్లద్‌ అనే వ్యక్తి తీహార్‌ జైలుకు వచ్చి ఈ నలుగురు దోషులను ఉరి తీయనున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2012 నిర్బయ కేసులో నలుగురు నిందితుల ఉరిశిక్ష అమలులో జాప్యం కావడానికి కారణం ఢిల్లీ ప్రభుత్వం నిర్లక్ష్యమేనని ఆరోపించారు.

 

నిర్భ‌య కేసులో దోషులుగా ఉన్న నలుగురు వ్యక్తులు ముఖేశ్‌(32), పవన్‌ గుప్తా(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (అక్షయ్‌ ఠాకూర్‌)(31)పై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి సతీశ్‌ కుమార్‌ అరోరా ఇప్పటికే డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం విదితమే. ఈ 14 రోజుల్లో దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా ఢిల్లీ పాటియాలా కోర్టు సూచించింది. దీంతో నిందితుల ఉరిలో జాప్యం జ‌రుగుతోంది. దీనిపై కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్ స్పందిస్తూ నిర్బయ కేసుకు న్యాయం జరుగడంలో అవుతున్న ఆలస్యానికి ఆప్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చురకలంటించారు. ఢిల్లీ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో నిర్బయ కేసు నిందితులకు క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు ఎందుకు నోటీసులు జారీచేయలేదని ప్రకాశ్‌ జవదేకర్‌ ప్రశ్నించారు.

 

తమకు ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ దోషులు ముకేష్ సింగ్, వినయ్ శర్మ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. దీంతో క్షమాభిక్ష కోరుతూ ముకేష్ అనే దోషి.. రాష్ర్టపతి కోవింద్ కు అభ్యర్థన పెట్టుకున్నాడు.  జైలు నిబంధనల ప్రకారం.. క్షమాభిక్షపై రాష్ర్టపతి నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంగీత దింగ్రా సెహగల్ కు ఢిల్లీ ప్రభుత్వం వివరించింది. ఒక వేళ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ర్టపతి తిరస్కరించినా.. నిబంధనల ప్రకారం దోషులను ఉరితీయడానికి ముందు కనీసం 14 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని తీహార్ జైలు అధికారులు కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో నలుగురు దోషుల ఉరిశిక్ష మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: