ఉగ్రవాదులతో పాటు పట్టుబడిన జమ్మూ-కాశ్మీర్‌ డి.ఎస్.పిపై ఎన్.ఐ.ఎ  విచారణ జరుపుతోంది. డి.ఎస్.పి దేవేందర్‌ సింగ్‌ లీలలపై జమ్మూ, శ్రీనగర్‌లో ఆరా తీస్తోంది. మరోవైపు దేవేందర్‌ సింగ్‌ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు అఫ్జల్ గురు భార్య తబుస్సుమ్. 

 

పోలీస్‌ యూనిఫామ్‌లో ఉండి... ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందజేసిన జమ్మూ-కాశ్మీర్‌ డి.ఎస్.పి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేవేందర్‌ సింగ్‌ చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కాదని దర్యాప్తులో తెలుస్తున్నాయి. తాజాగా  డి.ఎస్.పి దేవేందర్‌ సింగ్‌ ఉగ్ర లింకులపై ఎన్.ఐ.ఎ ఆరా తీస్తోంది.  

 

దేవేందర్‌ సింగ్‌  పెద్ద అవినీతి జలగ అన్నారు... అఫ్జల్ గురు భార్య తబుస్సుమ్. పార్లమెంటుపై దాడి కుట్ర కేసులో అరెస్టైన అఫ్జల్ గురును విడిపించుకునేందుకు తాను లక్ష రూపాయలు లంచం ఇచ్చానని బయటపెట్టారు. దీని కోసం నగలను అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోయారు తబుస్సుమ్.  

 

పార్లమెంట్‌ దాడి కుట్రకేసులోనే దేవేందర్‌ సింగ్‌ పేరు చెప్పాడు అఫ్జల్ గురు. అయితే దానికి సరైన ఆధారాలు లేకపోవడంతో... పోలీసులు చర్యలు తీసుకోలేకపోయారు. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు పోలీసులకు చిక్కకుండా వారికి దేవేందర్‌ సాయం చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అతనిపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది.  

 

మరోవైపు... హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది నవీద్‌ ముస్తాక్‌ కదలికలపై నిఘా పెట్టాయి దర్యాప్తు సంస్థలు. ఇటీవల ఫోన్ సంభాషణల ఆధారంగా ముస్తాక్‌ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు పోలీసులు. ఓ చెక్‌ పోస్ట్‌ వద్ద ముస్తాక్‌ ప్రయాణిస్తున్న కారును ఆపినప్పుడు... అందులో మరో ఉగ్రవాదితో పాటు దేవేందర్‌ సింగ్‌ ఉన్నాడు. దీంతో ముగ్గుర్నీ అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కారులో రెండు AK రైఫిళ్లతో పాటు ఓ పిస్టల్‌, మందుగుండు సామాగ్రి లభ్యమైంది. తర్వాత దేవేందర్‌ సింగ్‌ ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు ఓ ఏకే రైఫిల్‌తో పాటు రెండు పిస్టళ్లు లభ్యమయ్యాయి.  

 

ఉగ్రవాదులకు సహకరించిన దేవేందర్‌ సింగ్‌కు గతంలో ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీసు పతకం వచ్చినట్టు జరుగుతున్న ప్రచారంపై జమ్మూ-కాశ్మీర్‌ ప్రభుత్వం స్పందించింది. అది నిజం కాదంటూ కొట్టి పారేసింది. అయితే... పాతికేళ్ల సీనియారిటీ ప్రాతిపదికగా దేవేందర్‌ సింగ్‌కు త్వరలో ఎస్పీగా పదోన్నతి ఇవ్వాల్సి ఉంది. ఈ లోపే ఉగ్రవాదులకు సహకరిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో డీఎస్పీ దేవేందర్‌ సింగ్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: