తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తోంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికల్లో విజయం తమనే వరిస్తోందని పూర్తి విశ్వాసంతో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీల్లోని 2727 వార్డులకు, తొమ్మిది కార్పొరేషన్ పరిధిలోని 325 డివిజన్లకు 12,956 మంది పోటీలో నిలిచారు. కానీ రాష్ట్రంలోని పార్టీలు కాసులున్నోళ్లకు మాత్రమే టికెట్లు ఇచ్చారని, టికెట్లు అమ్ముకున్నారని తెలుస్తోంది.
 
రాష్ట్రంలో మున్సిపల్ టికెట్లను అమ్ముకున్నారని, డబ్బులున్నోల్లకే టికెట్లు కట్టబెట్టారని కొందరు నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తొలి నుండి పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి ఆ తరువాత వేరే వ్యక్తుల దగ్గర భారీగా సొమ్ము తీసుకొని బీఫారాన్ని కూడా వెనక్కు తీసేసుకున్నారని కొందరు నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కొందరు టికెట్లు ఇస్తామని చెప్పి డబ్బులున్నోళ్లకే టికెట్లు ఇవ్వడంతో ఆత్యహత్యాయత్నాలు చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
కొందరు రియల్టర్లు, వ్యాపారులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోట్ల రూపాయలు ఆఫర్ చేసి మరీ టికెట్లను దక్కించుకున్నారని ప్రముఖ పార్టీల నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న వ్యక్తికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 లక్షల రూపాయలు తీసుకొని ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు ఈ టికెట్ల లొల్లికి సంబంధించిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతునన్నాయి. 
 
కొందరు తెలంగాణ ఉద్యమాలలో పలు పార్టీల నుండి టికెట్ ఆశించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని కానీ టికెట్లు ఇవ్వకుండా పదవుల్లో ఉన్నవారు మోసం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తులకు, భూకబ్జాదారులకు టికెట్లు ఇచ్చారని పార్టీలకు ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడిన తమను మాత్రం మోసం చేశారని టికెట్లు దక్కని వారు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాసులున్నోళ్లకు మాత్రమే ప్రముఖ పార్టీల నుండి టికెట్లు దక్కాయని ప్రచారం జరుగుతోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: