తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మున్సిపల్ ఎన్నికల ముచ్చటే కనిపిస్తోంది. 120 మున్సిపాలిటీల్లోని వార్డులకు, తొమ్మిది కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లకు 12,956 మంది పోటీలో నిలిచారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల బేరాల జోరు బాగా నడిచిందని ఎవరు ఎక్కువ ఆఫర్ చేస్తే వాళ్లకే టికెట్లు దక్కాయని ప్రచారం జరుగుతోంది. 

 

ఎన్నికల్లో టికెట్ల బేరాల జోరు బాగా నడిచిందని టికెట్ ఆశించి భంగపడిన నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాలలో టికెట్లను బేరం పెట్టారని టికెట్ కోసం డబ్బులు ఇచ్చినప్పటికీ మరొకరు అంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తే వారికే టికెట్లు ఇచ్చారని కొందరు నేతలు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. టికెట్ల విషయంలో సర్వేలు చేయకుండా ఏం చేయకుండా డబ్బులను డిమాండ్లు చేస్తూ ప్రముఖ పార్టీలు టికెట్లు కేటాయించాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 


సోషల్ మీడియాలో కొందరు ప్రముఖ నేతలు టికెట్ల కోసం డబ్బులు డిమాండ్ చేసినట్టు, డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఇచ్చినట్టు ఆడియో రికార్డులు వైరల్ అవుతున్నాయి. కొన్ని జిల్లాలలో టికెట్ కు ఇంత మొత్తం అని అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలే ప్రకటించి అంత మొత్తం ఇచ్చినవారికే టికెట్లు కేటయించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీల కోసం కష్టపడినవారికంటే కాసులు ఇచ్చిన వారి వైపే పార్టీలు మొగ్గు చూపాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. 


కొన్ని చోట్ల టికెట్లను కోట్లల్లో ఆఫర్ ఇచ్చి వ్యాపారులు, రియల్టర్లు దక్కించుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కోసం బేరసారాలు బాగా జరిగాయని కాసులున్నోళ్లకే టికెట్లు దక్కాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా టికెట్లు దక్కించుకున్నవారిలో ప్రజలను మోసం చేసిన వారు, భూకబ్జాదారులే ఉన్నారని టికెట్లు దక్కని వారు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు మున్సిపల్ ఎన్నికల టికెట్ల లొల్లి గురించి, టికెట్లను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోటీ చేస్తున్నారని వస్తున్న వార్తల గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: