2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ పంచన చేరారు. పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ పంచన చేరి కామ్రేడ్లకు ఝలక్ ఇచ్చారు. వామపక్షాలకు తానేమైనా బాకీ పడ్డానా...? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను వామపక్షాలతో 2019 ఎన్నికల్లో మాత్రమే పని చేశానని కానీ అంతకుముందే బీజేపీ పార్టీతో కలిసి పని చేశానని పవన్ అన్నారు.
 
బీజేపీ పార్టీతో కలిసి పని చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కామ్రేడ్లు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. సీపీఎం సీనియర్ నేత గపూర్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల గురించి స్పందించారు. ఓటమితో నిరాశ చెంది, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి దిగజారుడు పద్దతిలో అధికారంలో ఉన్న పార్టీలతో కలిసి పని చేస్తామని పవన్ చెబుతున్నారని అన్నారు. వామపక్షాలకు నేనేమైనా బాకీ ఉన్నానా అని పవన్ అంటున్నారని రాజకీయాల్లో ఎవరికీ ఎవరూ బాకీ ఉండరని గపూర్ అన్నారు. 
 
కానీ పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీపై చేసిన విమర్శలు, కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర సమావేశాల్లో చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో పాచిపోయిన లడ్లు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. 
 
బీజేపీపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీ కలిసి ఎలా పని చేస్తారని గపూర్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన ఏడు నెలల్లో బీజేపీ పార్టీ ప్రాధాన్యత తగ్గిందే తప్ప పెరగలేదని గపూర్ అన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఈరోజు ఒక పార్టీతో రేపు మరో పార్టీతో ఉండటం పవన్ కళ్యాణ్ నైజం అని గపూర్ అన్నారు. పవన్ కళ్యాణ్ కు పార్టీని నడుపుకునే సామర్థ్యం లేదని గపూర్ అన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: