తెలంగాణ లో జరుగుతోన్న మున్సిపోల్స్ లో అధికార టీఆరెస్ అంతటా సానుకూలమైన వాతావరణమే కనిపిస్తోన్న కొల్లాపూర్ మున్సిపాలిటీ లో మాత్రం ఎదురుగాలి వీస్తోంది . కొల్లాపూర్ మున్సిపాలిటీ ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీఆరెస్ నాయకత్వం గట్టి పట్టుదలతో ఉంది . కొల్లాపూర్ లో పరిస్థితి ఏమాత్రం తారుమారైన మొదటికే మోసం వస్తుందని గ్రహించిన టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ , స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ని , ఇంచార్జ్ చాడ కిషన్ రెడ్డి ని తెలంగాణ భవన్ కు పిలిపించుకుని ప్రచార సరళిపై సమీక్ష చేశారు . కొల్లాపూర్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురాల్సిన ఆవశ్యకత ను వివరించారు .

 

కొల్లాపూర్ మున్సిపాలిటీ ని టీఆరెస్ నాయకత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణాలు లేకపోలేదు . ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టీఆరెస్  తరుపున పోటీ చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో  ఓటమి పాలయ్యారు . అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యం లో హర్షవర్ధన్ రెడ్డి కారెక్కేశారు . అప్పటి నుంచి పార్టీ లో జూపల్లికి ప్రాధాన్యత లేకుండా పోయింది . ఇక తాజాగా జరుగుతోన్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పార్టీ నాయకత్వం ఎమ్మెల్యేలకు అప్పగించిన విషయం తెల్సిందే . కొల్లాపూర్ లో హర్షవర్ధన్ ఎంపిక చేసి, పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థులకు పోటీగా  జూపల్లి తన అనుచరులను రంగం లోకి దింపారు .

 

అన్ని వార్డుల్లో తన అనుచరులను పోటీకి పెట్టిన ఆయన , వారికి తాను మద్దతునిస్తున్నట్లు పేర్కొని , పార్టీ నాయకత్వానికి ఝలక్ ఇచ్చారు . కొల్లాపూర్ లో ప్రస్తుతం జూపల్లి వర్సెస్ టీఆరెస్ అన్నట్లుగా పరిస్థితి తయారయింది . దీనితో ఎలాగైనా కొల్లాపూర్ మున్సిపల్ పై గులాబీ జెండా ఎగిరి తీరాల్సిందేనని పార్టీ నాయకత్వం శతవిధాలుగా ప్రయత్నం చేస్తోంది . చూడాలి మరి ఏమి జరుగుతుందో .

మరింత సమాచారం తెలుసుకోండి: