ఒపీనియన్ మార్చుకోనివాడు అసలు పొలిటీషియనే కాదు అన్నాడు గిరీశం.. ఇప్పుడు మన పవన్ కల్యాణ్ తీరు చూస్తే.. ఆ గిరీశం కూడా మూర్చపోయేలా ఉన్నాడు.. నిన్న మొన్నటి వరకూ వామపక్షాలతో జట్టు కట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు కమలం పంచన చేరిపోయాడు. ఇకపై బీజేపీ, జనసేన కలసి పని చేస్తాయని ప్రకటించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి కమలాధీశులతో ఒప్పందం కుదుర్చుకుని వచ్చిన పవన్ కల్యాణ్.. కనుమ సంక్రాంతి వేళ కమలం రాష్ట్రనేతలతో భేటీ అయి ఒప్పందాన్ని పరిపుష్టం చేసుకున్నారు.

 

అయితే.. గతంలో కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టిన పవన్ కల్యాణ్.. ప్రత్యేక హోదాపై కేంద్రం తీరును తీవ్రంగా విమర్శించారు. కేంద్రం ప్రత్యేక హోదా బదులు రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టిందని కామెంట్ చేసారు. పవన్ లడ్డూల కామెంట్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. అయితే అప్పటికీ ఇప్పటికీ సీన్ లో ఏమాత్రం మార్పులేదు. కేంద్రం ఏపీకి చేసిన సాయం రొటీన్ సాయమే తప్ప ప్రత్యేకత లేదు. అయినా పవన్ బీజేపీతో జట్టు కట్టారు.

 

అంటే అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు కమ్మగా ఉన్నాయేమో అన్న కామెంట్లు బాగా వినిపిస్తున్నాయి. ఇదే మాట పవన్ ను అడిగితే.. ప్రత్యేక హోదా అంశంపై వైసిపి, టిడిపిలను అడగాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రశ్న ఇప్పుడు 22 మంది ఎంపీలున్న వైసీపీని అడగాలంటున్నారు. అంతే కాదు.. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ది విషయంలో ప్రధాని మోడీకి స్పష్టత ఉందని, అయితే ఇక్కడ రాజకీయ అవినీతి,కులం ,కుటుంబ పాలన పోవాలని పవన్ అంటున్నారు.

 

మరి గతంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు కదా అని అడిగితే వారికి ఏమైనా తాను బాకీ ఉన్నానా అంటూ సెటైర్ వేసారు. అంతే కాదు.. అంతకుముందు 2014లో బిజెపితో ఉన్న సంగతి గుర్తు ఉంచుకోవాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. పాపం పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు వారు బీజేపీతో పవన్ స్నేహాన్ని ఎలా అర్థం చేసుకుంటారో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: